-

SuryaKumar Yadav: 'సలహాలు అవసరం లేదు.. ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు'

15 Apr, 2022 17:54 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన ముంబై బోణీ కొట్టలేపోయింది. అయితే ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు వచ్చినప్పటికి ముంబై ఇండియన్స్‌ను రనౌట్లు కొంపముంచాయి. ఆ రనౌట్లలో పరోక్షంగా సూర్యకుమార్‌ యాదవ్‌ పాత్ర ఉంది.

అయితే మ్యాచ్‌లో జూనియర్‌ ఏబీ డెవాల్డ్‌ బ్రెవిస్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 25 బంతుల్లోనే 49 పరుగులు చేసిన బ్రెవిస్‌.. రాహుల్‌ చహర్‌ను ఉతికారేశాడు. అతను వేసిన ఒక ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది హడలెత్తించాడు. అతనితో పాటు తిలక్‌ వర్మ కూడా ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. వీరిద్దరు ఔట్‌ కాని పక్షంలో ముంబై ఇండియన్స్‌ పరిస్థితి వేరుగా ఉండేది. అందుకే వీరిద్దరిపై సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించాడు. శుక్రవారం ఎన్‌డీటీవీ నిర్వహించిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్‌ పాల్గొన్నాడు.

''ఈ సీజన్‌లో మాకు మంచి ఆరంభం లభించలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. మ్యాచ్‌లు ఓడాలని మాకు ఉండదు. ప్రతీ మ్యాచ్‌ గెలవాలని ప్రయత్నిస్తున్నాం.. కానీ ఓటములు పలకరిస్తున్నాయి. కచ్చితంగా కుదురుకుంటాం.. విజయాలు అందుకుంటాం. అయితే జట్టుగా విఫలమైనా మాకు ఇద్దరు ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు దొరికారు. ఆ ఇద్దరే డెవాల్డ్‌ బ్రెవిస్‌, తిలక్‌ వర్మ. 19 ఏళ్ల వయసులో వీరిద్దరు అద్బుతాలు చేస్తున్నారు. తమ విధ్వంసకర ఆటతీరుతో అభిమానాన్ని చూరగొంటున్నారు. నిజానికి ఒక సీనియర్‌గా వాళ్లకి సలహాలు ఇవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆ స్థాయిని వాళ్లిద్దరు ఎప్పుడో దాటేశారు. ఒక రకంగా టీనేజ్‌ వయసులో ఉన్నప్పుడు వాళ్లగా షాట్లు ఎందుకు ఆడలేకపోయానా అని నాకే ఆశ్చర్యమేస్తోంది. కచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద పేరు సంపాదించడం ఖాయం. అని పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు!

మరిన్ని వార్తలు