IPL 2022: చాన్స్‌ ఇస్తే... చెలరేగిపోయారు... ఈ నలుగురు వారికి వారే సాటి! అద్భుతంగా..

27 May, 2022 09:58 IST|Sakshi
రజత్‌ పాటిదార్‌, మొహసిన్‌ ఖాన్‌, తిలక్‌ వర్మ, ఉమ్రాన్‌ మాలిక్‌

చాన్స్‌ ఇస్తే... చెలరేగిపోవడమే...

IPL 2022: ఒకరు నెట్‌బౌలర్‌గా జట్టులోకి వచ్చి ఏడాది తిరిగే లోపు ఏకంగా భారత జట్టులోకి వచ్చేస్తే, మరొకరు మూడేళ్లు బెంచీకే పరిమితమై మరో జట్టు మ్యాచ్‌ ఇవ్వగానే చెలరేగిపోయాడు... వేలంలో ఎవరూ ఎంచుకోక నిరాశ చెందిన ఆటగాడు అదృష్టం కలిసొచ్చి మళ్లీ పిలుపు వచ్చినప్పుడు వస్తే ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు.

దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శనతో సీజన్‌కే హైలైట్‌గా నిలిచిన కుర్రాడు మరొకడు... ఐపీఎల్‌కు ఎంపిక కావడమే యువ క్రికెటర్ల దృష్టిలో ఒక ఘనత కాగా, తుది జట్టులో స్థానం లభించి సత్తా చాటడం మరో పెద్ద అడుగు. ఈ ఏడాది అలా ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేసిన కొందరు ఆటగాళ్లను చూస్తే... 
 
ఉమ్రాన్‌ మలిక్‌ (సన్‌రైజర్స్‌)
2021 ఐపీఎల్‌లో తమ ఆటగాడు సమద్‌ చెప్పిన మాటలపై నమ్మకంతో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్‌ మలిక్‌ను సన్‌రైజర్స్‌ నెట్‌ బౌలర్‌గా యూఏఈకి తీసుకెళ్లింది. సాధనలోనే అతడి వేగం అందరినీ కట్టి పడేసింది. నటరాజన్‌ కరోనా బారిన పడటంతో ఉమ్రాన్‌కు ప్రధాన టీమ్‌లో కూడా చోటు లభించింది. మూడు మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగగా, నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయడం కెప్టెన్‌ కోహ్లిని కూడా ఆకర్షించింది.

దాంతో వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు సరైన ఫాస్ట్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ కోసం అతడిని బీసీసీఐ అక్కడే ఉంచింది. ఈ సీజన్‌కు వచ్చేసరికి మరింత రాటుదేలిన ఉమ్రాన్‌ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా గుజరాత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన అద్భుతం. 14 సార్లూ ‘ఫాస్టెస్ట్‌ బాల్‌’ అవార్డు గెలుచుకున్న అతను 22 వికెట్లు పడగొట్టాడు. అనుభవంతో ప్రతీ మ్యాచ్‌కు మెరుగవుతూ వేగానికి బంతిపై నియంత్రణను కూడా జోడించడం సెలక్టర్లను ఆకట్టుకునేలా చేసి దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం భారత జట్టులో చోటు దక్కేలా చేసింది.  

మొహసిన్‌ ఖాన్‌ (లక్నో సూపర్‌జెయింట్స్‌)  
2018లో దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చిన లెఫ్టార్మ్‌ పేసర్‌ మొహసిన్‌కు సరైన వేదిక లభించేందుకు నాలుగేళ్లు పట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు చెందిన మొహసిన్‌ను 2019లోనే ముంబై ఇండియన్స్‌ జట్టు తీసుకున్నా...మూడు సీజన్ల పాటు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించకుండా బెంచీకే పరిమితం చేసింది. తీవ్ర అసహనానికి గురైనా, ముంబైలాంటి జట్టులో అంత సులువుగా అవకాశం దక్కదు కాబట్టి తన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టాడు.

ఈ సారి లక్నో అతడిని ఎంచుకుంది. ఇక్కడా ఆరంభ మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కలేదు. అయితే కొత్త బంతిని అందించిన మొదటి మ్యాచ్‌నుంచే సత్తా చాటుతూ అతని ప్రత్యర్థులను కట్టి పడేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్‌తో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో నిలిచిన మొహసిన్‌ కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు కూడా తీశాడంటే అతని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది.  
చదవండి: Who Is Mohsin Khan: ఢిల్లీ క్యాపిటల్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ మొహసిన్‌‌ ఖాన్..?

రజత్‌ పటిదార్‌ (బెంగళూరు) 
గత సీజన్‌లో పటిదార్‌ను బెంగళూరు 4 మ్యాచ్‌లలో ఆడించగా, అతను మొత్తం 71 పరుగులు చేశాడు. ఈ సారి అతనిపై నమ్మకం లేక వేలంలో కనీసం పటిదార్‌ పేరు కూడా తీసుకోలేదు. ఆర్‌సీబీ మాత్రమే కాదు ఎవరూ వేలంలో ఎంచుకోకపోవడంతో రజత్‌ తన స్వస్థలం ఇండోర్‌ వెళ్లిపోయి సాధనలో మునిగిపోయాడు. అయితే అదృష్టం మరో రూపంలో కలిసొచ్చింది. లవ్‌నిత్‌ సిసోడియా గాయపడటంతో అతని స్థానంలో మళ్లీ రజత్‌ను ఆర్‌సీబీ పిలిచింది.

తన రెండో మ్యాచ్‌లోనే 32 బంతుల్లో 52 పరుగులు చేసినా జట్టు ఓటమితో ఆ ఆటకు గుర్తింపు దక్కలేదు. లీగ్‌ దశలో 5 మ్యాచ్‌లలోనూ చెప్పుకోదగ్గ పరుగులే చేసిన రజత్‌...నాకౌట్‌ మ్యాచ్‌లో తానేంటో చూపించాడు. మైదానమంతా చెలరేగిపోతూ ఎలిమినేటర్‌ అతను చేసిన సెంచరీ బెంగళూరు అభిమానులు మరో సారి తమ జట్టు టైటిల్‌ సాధించడంపై ఆశలు పెట్టుకునేలా చేసింది. 
చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్‌ పాటిదార్‌..?

తిలక్‌వర్మ (ముంబై ఇండియన్స్‌)  
ప్రతిభ, పట్టుదలకు తోడు కీలక సమయాల్లో ఎలాంటి ఒత్తిడినీ చూపించకుండా సాధికారికంగా, అనుభవజ్ఞుడిలా తిలక్‌వర్మ ఆడిన తీరు సునీల్‌ గావస్కర్, రోహిత్‌శర్మలాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకునేలా చేసింది. 2020 అండర్‌–19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఉన్న హైదరాబాదీ తిలక్‌ కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మాట్లలో సత్తా చాటి సొంత టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు.

వేలంలో రూ.1.7 కోట్లకు ముంబై అతడిని ఎంచుకున్నప్పుడు కూడా తుది జట్టులో అవకాశం లభిస్తుందా అనే సందేహాలు! అయితే తన అద్భుత ఆటతో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలి సీజన్‌లోనే టీమ్‌లో కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారి భవిష్యత్తు తారగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 14 మ్యాచ్‌లలో 131.02 స్ట్రైక్‌రేట్‌తో 397 పరుగులు చేసిన తిలక్‌ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు.    

చదవండి: KL Rahul-Sanjay Manjrekar: 'కోచ్‌గా ఉండుంటే కేఎల్‌ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని'

మరిన్ని వార్తలు