IPL 2022: గత సీజన్‌లో అదరగొట్టారు.. కోట్లు కొల్లగొట్టారు.. కానీ ఈసారి తుస్సుమన్నారు!

21 May, 2022 15:53 IST|Sakshi
గత సీజన్‌లో అదరగొట్టారు.. ఈసారి తుస్సుమన్న ఆటగాళ్లు(PC: IPL/BCCI)

IPL 2022: ఐపీఎల్‌ లాంటి టీ20 టోర్నమెంట్‌లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. పొట్టి ఫార్మాట్‌లో ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగటం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సీజన్‌లో అదరగొట్టిన వాళ్లు.. మరో ఎడిషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు. 

లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్‌  డేవిడ్‌ వార్నర్‌లా గతంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన వాళ్లు తిరిగి విజృంభించనూ వచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2021లో అదరగొట్టి.. 2022 ఎడిషన్‌లో చతికిలపడ్డ టాప్‌-5 ఆటగాళ్లు ఎవరో ఓసారి గమనిద్దాం.


PC: IPL/BCCI

మయాంక్‌ అగర్వాల్‌
పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఐపీఎల్‌-2021లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 441 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇక పంజాబ్‌ తరఫున గత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా మయాంక్‌ నిలిచాడు.

అయితే, తాజా సీజన్‌లో పరిస్థితులు మారాయి. 12 కోట్ల రూపాయలకు రిటైన్‌ చేసుకుని పంజాబ్‌ కెప్టెన్‌గా అతడిని నియమించింది ఫ్రాంఛైజీ. కానీ కెప్టెన్సీ భారం మోయలేక మయాంక్‌ చేతులెత్తేశాడు.  బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. ఐపీఎల్‌-2022లో ఆడిన 12 మ్యాచ్‌లలో కలిపి 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మయాంక్‌ సారథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ పెద్దగా రాణించింది కూడా లేదు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం ఆరు గెలిచి ఏడో స్థానంలో ఉంది. 


PC: IPL/BCCI

వెంకటేశ్‌ అయ్యర్‌
దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన మధ్యప్రదేశ్‌ యువ ప్లేయర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్‌ రెండో అంచెలో వరుస అవకాశాలు దక్కించుకున్న వెంకటేశ్‌.. 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. 

ఈ క్రమంలో టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఐపీఎల్‌-2022లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో ఒకానొక సమయంలో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మొత్తంగా ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌ ఆడిన అతడు కేవలం 182 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 50 నాటౌట్‌. తనను రిటైన్‌ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ ఖర్చు చేసిన 8 కోట్లకు న్యాయం చేయలేకపోయాడు.


PC: IPL/BCCI

కీరన్‌ పొలార్డ్‌
వెస్టిండీస్‌ బ్యాటర్‌, ముంబై ఇండియన్స్‌ హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2010 నుంచి ముంబై జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్‌ మాజీ కెప్టెన్‌ గత సీజన్‌లో 245 పరుగులు చేశాడు. చెన్నైపై సంచలన ఇన్నింగ్స్‌(34 బంతుల్లో 87 పరుగులు నాటౌట్‌) ఆడాడు.

కట్‌ చేస్తే ఐపీఎల్‌-2022లో పరిస్థితి తలకిందులైంది. 6 కోట్లకు ముంబై రిటైన్‌ చేసుకుంటే స్థాయికి తగ్గట్లు రాణించలేక అతడు డీలా పడ్డాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి పొలార్డ్‌ చేసిన స్కోరు 144. ఇక వరుసగా పొలార్డ్‌ నిరాశపరిచిన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే తలంపుతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు.


PC: IPL/BCCI

హర్షల్‌ పటేల్‌
గత ఐపీఎల్‌ ఎడిషన్‌లో అదరగొట్టే ప్రదర్శనతో పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌ హర్షల్‌ పటేల్‌. ఆడిన 15 మ్యాచ్‌లలో 8.14 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్‌’ పటేల్‌ అని కితాబులందుకున్నాడు.

ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌ చేర్చడంలో హర్షల్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్‌లో వదిలేసిన్పటికీ మెగా వేలంలో ఆర్సీబీ అతడ కోసం 10.75 కోట్లు వెచ్చించింది. కానీ తాజా సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 12 మ్యాచ్‌లలో అతడు తీసినవి 18 వికెట్లు. గతేడాది పోలిస్తే ఈసారి పెద్దగా రాణించలేదనే చెప్పాలి.


PC: IPL/BCCI

వరుణ్‌ చక్రవర్తి
మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గత ఐపీఎల్‌ సీజన్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ అద్భుత ప్రదర్శనతో యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. ఏకంగా ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచింది.

ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో వరుణ్‌ను 8 కోట్లకు రిటైన్‌ చేసుకుంది కేకేఆర్‌. కానీ అతడు ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో తుదిజట్టు నుంచి తప్పించి హర్షిత్‌ రాణా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఐపీఎల్‌-2022లో వరుణ్‌ చక్రవర్తి 11 ఇన్నింగ్స్‌లో కలిపి తీసిన వికెట్ల సంఖ్య- 6. 

చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్‌ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్‌
చదవండి👉🏾IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి!

మరిన్ని వార్తలు