IPL 2022: ఆ క్రికెటర్‌ను తీసుకోవాల్సిందే.. సీఎస్‌కేకు అభిమానుల డిమాండ్‌

12 Apr, 2022 19:20 IST|Sakshi

ఐపీఎల్‌ 2022లో సీఎస్‌కేకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అసలే ఓటముల బాధలో ఉన్న సీఎస్‌కేకు దీపక్‌ చహర్‌ సీజన్‌ మొత్తానికే దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తేలడంతో పుండు మీద కారం చల్లినట్లయింది. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో దీపక్‌ చహర్‌ను రూ. 14 కోట్లు పెట్టి సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

దీపక్‌ చహర్‌ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉండడంతో టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మను చహర్‌ స్థానంలో తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. 33 ఏళ్ల ఇషాంత్‌ ఇటీవలే టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు.  ఫామ్‌ కోల్పోయి సతమతవుతున్న ఇషాంత్‌ను సెలెక్టర్లు పక్కనబెట్టేశారు. ఇక జట్టులోకి ఇషాంత్‌ రావడం కష్టమే. దీనికి తోడూ మెగావేలంలో అమ్మడుపోని జాబితాలో చేరిపోయాడు.

ఇషాంత్‌కు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న ముంబై, పూణే స్టేడియాలో సరిగ్గా సరిపోతాయని.. గతంలో అతనికి మంచి రికార్డు ఉందంటూ చాలా మంది ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్న సీఎస్‌కేకు ఇషాంత్‌ రాకతో మార్పు వస్తుందేమో.. అంటూ పేర్కొన్నారు. కాగా కొన్నిరోజుల క్రితం ఐపీఎల్‌ వర్చువల్‌ గెస్ట్‌ బాక్స్‌లో ఇషాంత్‌ దర్శనమిచ్చాడు. ఇది చాలా మంది అభిమానులకు నిరాశ కలిగించింది. అందుకే ఇషాంత్‌ను సీఎస్‌కే తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఇషాంత్‌పై అభిమానులు చేసిన ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్‌ సీజన్‌ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్‌ ముఖ్యమా.. వదిలి రండి!

Jasprit Bumrah: 'సంధికాలం నడుస్తోంది.. మార్చాల్సిన సమయం వచ్చేసింది!'

మరిన్ని వార్తలు