Ravi Shastri: ఉమ్రాన్‌ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్‌ ప్రశంసల వర్షం

30 Mar, 2022 19:03 IST|Sakshi

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ కశ్మీరీ బౌలర్‌ది టీమిండియా స్థాయి అని కొనియాడాడు. మాలిక్‌పై టీమిండియా సెలెక్టర్లు ఓ కన్నేసి ఉంచాలని, అతనికి జాతీయ జట్టులో చోటు కల్పిస్తే అద్భుతాలు చేస్తాడని జోస్యం చెప్పాడు. గత కొంత కాలంగా మాలిక్‌ భీకరమైన పేస్‌తో బంతులను సంధిస్తున్నాడని, అతనిలో నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే తత్వం కనబడుతుందని, ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణాల్లా మారతారని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న భారత యువ పేసర్లలో మాలిక్‌ అత్యద్భుతమని కితాబునిచ్చాడు. బంతిని ల్యాండ్‌ చేసే విషయంలో కొద్దిగా సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ, సరైన శిక్షణతో ఆ లోపాన్ని అధిగమించవచ్చని సలహా ఇచ్చాడు. 

కాగా, ఉమ్రాన్‌ మాలిక్‌ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించాడు. గతేడాది ఐపీఎల్‌లో మాలిక్‌ ఏకంగా 153 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి.. తొలిసారి వార్తల్లో నిలిచాడు. ఈ ప్రదర్శన కారణంగానే సన్‌రైజర్స్ అతన్ని ఈ ఏడాది రిటైన్ చేసుకుంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిగతా పేసర్లందరూ బౌలింగ్‌ చేసేందుకు ఇబ్బందిపడినప్పటికీ మాలిక్‌ మాత్రం అద్భుతమైన పేస్‌తో బౌలింగ్‌ చేసి 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుని 2 కీలక వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌ తరహాలోనే ఐపీఎల్‌ 2022 తొలి మ్యాచ్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ రాజస్థాన్‌ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 
చదవండి: 'అతడు ఫుల్‌ ఫిట్‌గా ఉన్నాడు.. ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు ఖాయం'

మరిన్ని వార్తలు