Rajat Patidar: ఒత్తిడిలోనూ. వారెవ్వా.. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌: కోహ్లి ప్రశంసలు

26 May, 2022 12:19 IST|Sakshi
రజత్‌ పాటిదార్‌తో విరాట్‌ కోహ్లి(PC: IPL/BCCI)

IPL 2022 RCB Eliminate LSG: ఎలిమినేటర్‌ మ్యాచ్‌ హీరో రజత్‌ పాటిదార్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాటర్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌ ఇన్నింగ్స్‌ ఒకటని సహచర ఆటగాడిని కొనియాడాడు. ఒత్తిడిలోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ బ్యాటింగ్‌ చేసిన విధానాన్ని ప్రశంసించాడు. కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటాడంటూ పాటిదార్‌కు కోహ్లి కితాబిచ్చాడు.

ఐపీఎల్‌-2022లో ముందుడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఆర్సీబీ జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఆసక్తికరపోరులో లక్నోపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌తో క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించింది. 

అయితే , ఈ విజయంలో రజత్‌ పాటిదార్‌కే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు చేయడంలో సాయం చేశాడు. ఇందుకు దినేశ్‌ కార్తిక్‌(23 బంతుల్లో 37 పరుగులు- నాటౌట్‌) కూడా తోడయ్యాడు. 

ఈ క్రమంలో భారీ లక్ష్యం ఛేధించలేక చతికిలపడ్డ లక్నో ఓటమిపాలైంది. ఫలితంగా ఎలిమినేటర్‌ గండాన్ని దాటిన ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో రజత్‌ పాటిదార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక మ్యాచ్‌ అనంతరం కోహ్లి రజత్‌తో ముచ్చటిస్తూ అద్భుత ఇన్నింగ్స్‌ చూశానని పేర్కొన్నాడు.

‘‘నా సుదీర్ఘ కెరీర్లో నేను చాలా గొప్ప ఇన్నింగ్స్‌ చూశాను. మ్యాచ్‌ స్వరూపానే మార్చివేయగల ఆట చూశాను. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించగల ఆటగాళ్లను చూశాను. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ అలాంటి అత్యద్భుత ఇన్నింగ్స్‌ చూశాను. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌.. తీవ్ర ఒత్తిడి అయినా.. కూడా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ చరిత్రలో సెంచరీ సాధించిన మొదటి అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు’’ అంటూ పాటిదార్‌ను కోహ్లి ఆకాశానికెత్తాడు.

ఐపీఎల్‌-2022: ఎలిమినేటర్‌ మ్యాచ్‌- లక్నో వర్సెస్‌ ఆర్సీబీ స్కోర్లు
టాస్‌: లక్నో
ఆర్సీబీ- 207/4 (20)
లక్నో- 193/6 (20)
విజేత: ఆర్సీబీ
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రజత్‌ పాటిదార్‌

చదవండి: KL Rahul: ఛ.. మరీ చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే! పాటిదార్‌ అద్భుతం!
IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్‌ పాటిదార్‌..?

మరిన్ని వార్తలు