కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్.. గుజ‌రాత్‌పై హాఫ్ సెంచ‌రీతో  మెరిసిన ఆర్సీబీ స్టార్‌

30 Apr, 2022 18:58 IST|Sakshi
photo courtesy: IPL

గ‌త కొంత‌కాలంగా ఫామ్ లేమితో స‌త‌మ‌త‌మ‌వుతూ టీమిండియాతో పాటు ఆర్సీబీలో చోటును సైతం  ప్ర‌శ్నార్ధ‌కంగా మార్చుకున్న ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి ఎట్ట‌కేల‌కు ఫామ్‌ను దొర‌క‌బుచ్చుకున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో వ‌రుస‌గా 9 మ్యాచ్‌ల్లో క‌నీసం హాఫ్‌ సెంచ‌రీ కూడా సాధించ‌లేని కోహ్లి.. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అర్ధ సెంచ‌రీ సాధించి ఊపిరిపీల్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ‌రిలోకి దిగిన కోహ్లి, తొలి ఓవర్ నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ డుప్లెసిస్ డకౌట్ అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం ఏకాగ్ర‌త కోల్పోకుండా బాధ్య‌తాయుతంగా బ్యాటింగ్ చేశాడు. 

ఈ ఇన్నింగ్స్ ఆసాంతం అద్భుత‌మైన షాట్ల‌తో అల‌రించిన కోహ్లి 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో యువ‌ ఆట‌గాడు రజత్ పటిదార్‌తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 15 ఇన్నింగ్స్‌ల తర్వాత చేసిన హాఫ్ సెంచరీ కావ‌డంతో కోహ్లి, అత‌ని స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ స‌హా కోహ్లి అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు బాదిన కోహ్లి.. మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ త‌ర్వాత (429 సిక్సర్లు) అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన రెండో భార‌త ఆట‌గాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్ర‌స్తుతం కోహ్లి ఖాతాలో 326 సిక్సర్లు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి (53 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్‌), ర‌జ‌త్ ప‌టిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో గుజ‌రాత్‌తో జ‌రుగుతున్న మ్యాచ్ ఆర్సీబీ ఓ మోస్త‌రు స్కోర్ సాధించ‌గ‌లిగింది.  నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. 19వ ఓవ‌ర్లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఫెర్గుస‌న్ పెవిలియ‌న్‌కు పంపించ‌డంతో ఆర్సీబీ భారీ స్కోర్ ఆశ‌లకు గండిప‌డింది. ఆఖ‌రి ఓవ‌ర్లో లోమ్రార్ ఓ సిక్స‌ర్, ఫోర్ స‌హా 15 ప‌రుగులు రాబ‌ట్ట‌డంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా సాధించ‌గ‌లిగింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌దీప్ సాంగ్వాన్ 2 , ష‌మీ, జోస‌ఫ్‌, ఫెర్గుస‌న్‌, ర‌షీద్ ఖాన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

చ‌ద‌వండి: క్రికెట్ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్ త‌ర‌హాలో మ‌రో లీగ్‌
 

మరిన్ని వార్తలు