IPL 2022- Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణమిదే: కోహ్లి

24 Feb, 2022 16:38 IST|Sakshi

IPL 2022 Auction- Virat Kohli: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు... ఫ్యాన్‌ బేస్‌.. బ్రాండ్‌ వాల్యూ ఎక్కువే. కానీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. టీమిండియా విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న విరాట్‌ కోహ్లి సారథిగా ఉన్నా ఒక్కసారి కప్‌ సాధించలేకపోయింది. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌తో కోహ్లి ఆర్సీబీ సారథ్యానికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణాలను ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మరోసారి ప్రస్తావించాడు కోహ్లి. 

ఈ మేరకు అతడు మాట్లాడుతూ... ‘‘నేను చేయగలిగిన దానికంటే ఎక్కువే చేయగలనని తెలిసినా కొన్నిసార్లు నేను బాధ్యతను తలకెత్తుకోను. ఒకవేళ చేయాల్సి వచ్చినా మనస్ఫూర్తిగా చేయలేను. మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు షాక్‌కు గురయ్యాం అని అంటూ ఉంటారు కొంతమంది! అయితే, మన స్థానంలో ఉండి ఆలోచించినపుడే వాళ్లకు అసలు విషయం అర్థమవుతుంది. అది తెలుసుకోలేక కొంతమంది.. ‘‘అయ్యో ఇదెలా జరిగింది? మేము ఆశ్చర్యపోయాం’’అని అంటూ ఉంటారు.

నిజానికి అందులో షాకవ్వాల్సింది ఏమీ లేదు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. వర్క్‌లోడ్‌ తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా. అదే విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రకటన చేశాను’’ అని పునరుద్ఘాటించాడు. క్వాంటిటీతో పాటు తనకు క్వాలిటీ కూడా ముఖ్యమని స్పష్టం చేశాడు. అందుకే ఏదో ఒక బాధ్యతనైనా సక్రమంగా నెరవేర్చాలనుకుంటున్నానని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా 7 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా!
IPL 2022 Auction: డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్‌ వేసి ఆడేవాడిని.. అందుకే బోరున ఏడ్చేశారు: తిలక్‌ వర్మ

కాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాజీ ప్లేయర్‌ ఏబీ డివిల్లియర్స్‌ వంటి ఇతర స్టార్లు కూడా మాట్లాడారు.

మరిన్ని వార్తలు