MI VS KKR: వడ పావ్‌ ట్వీట్‌.. సెహ్వాగ్‌పై ఫైరవుతున్న హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌

7 Apr, 2022 16:20 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై, కేకేఆర్‌ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన హైఓల్టేజీ పోరులో పాట్‌ కమిన్స్‌ (15 బంతుల్లో 56 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్ల) విధ్వంసం ధాటికి కేకేఆర్‌ మరో 24 బంతులుండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కమిన్స్‌ సునామీ ఇన్నింగ్స్‌ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘నోటికాడి వడా పావ్‌ లాగేసుకున్నాడు’ అంటూ కమిన్స్‌ 14 బంతుల అర్ధశతకాన్ని ఉద్దేశిస్తూ.. ప్రత్యర్ధి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చురక తగిలేలా ట్వీట్‌ చేశాడు. 


సెహ్వాగ్‌ సరదాగా చేసిన ఈ ట్వీట్‌ హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. తమ అభిమాన క్రికెటర్‌ను ఉద్దేశిస్తూ సెహ్వాగ్‌ వ్యంగ్యమైన ట్వీట్‌ చేయడాన్ని హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. కమిన్స్‌ పూనకం వచ్చిన వాడిలా ఉగిపోతే రోహిత్‌ మాత్రం ఏం చేయగలడని వీరూకు కౌంటరిస్తున్నారు. అంతటితో ఆగకుండా రోహిత్‌ శర్మను పరోక్షంగా వడా పావ్‌తో పోల్చినందుకు గానూ సెహ్వాగ్‌పై ఎదురుదాడికి దిగారు. కొన్ని మ్యాచ్‌ల్లో ఫెయిల్యూర్స్‌కు గాను ఫైవ్‌ టైమ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ను అంతలా అవమానించాలా అంటూ సెహ్వాగ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. 

కాగా, ముంబైతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ నిజంగానే మ్యాచ్‌ను ముంబై చేతిలో నుంచి లాగేసుకుంది. 162 పరుగుల లక్ష్య ఛేదనలో 13 ఓవర్లలో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కేకేఆర్‌ను కమిన్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. కేవలం 19 నిమిషాల పాటు సాగిన ఈ తుఫాన్‌ ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీల పూర్తి చేసి ఐపీఎల్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును కేఎల్‌ రాహుల్‌తో కలిసి సంయుక్తంగా పంచుకున్నాడు. 

డేనియల్‌ సామ్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన కమిన్స్‌ ఏకంగా 35 పరుగులు పిండుకుని ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు కాలరాత్రి అనుభవాన్ని మిగిల్చాడు. ఈ ఓవర్‌కు ముందు 2 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన సామ్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఎక్స్‌పెన్సివ్‌ ఓవర్‌ను వేశాడు. 2011లో ఆర్సీబీతో మ్యాచ్‌లో పరమేశ్వరన్‌ ఒకే ఓవర్‌లో 37 పరుగులు, గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకోగా తాజాగా సామ్స్‌ వీరి తర్వాత ఐపీఎల్‌ అత్యంత చెత్త బౌలింగ్‌ రికార్డును నమోదు చేశాడు.   
చదవండి: చిరాకులో ఉన్న రోహిత్‌.. తీవ్రంగా శ్రమిస్తున్న ఢిల్లీ ఆటగాళ్లు

మరిన్ని వార్తలు