IPL 2022: ధోని ఉన్నాడుగా.. సీఎస్‌కే విషయంలో జరిగేది ఇదే: సెహ్వాగ్‌

2 May, 2022 18:52 IST|Sakshi
సెహ్వాగ్‌- ధోని(PC: BCCI/IPL)

IPL 2022 CSK VS SRH: ఐపీఎల్‌-2022 సీజన్‌లో తిరిగి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) పగ్గాలు చేపట్టగానే కెప్టెన్‌గా విజయంతో ఆరంభించాడు ఎంఎస్‌ ధోని. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలుపుతో చెన్నైని విజయాల బాట పట్టించాడు. తన మార్కు కెప్టెన్సీతో ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ధోని గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ధోని సారథ్యంలో సీఎస్‌కే వరుస విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌ చేరుకుంటుందని సెహ్వాగ్‌ అంచనా వేశాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘2005 నుంచి అతడితో కలిసి ఉన్నాను. అతడి నేతృత్వంలో టీమిండియాలో ఎలాంటి మార్పులు జరిగాయో చూశాను. ఐసీసీ నాకౌట్లలో గెలుపొందాం. ఓడిపోతానుమనుకున్న మ్యాచ్‌లలో అనూహ్య విజయాలు నమోదు చేశాం. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే సీఎస్‌కే వరుస మ్యాచ్‌లలో తప్పకుండా గెలుస్తుందనిపిస్తోంది. ఇది జరిగి తీరుతుంది’’ అని పేర్కొన్నాడు. సెహ్వాగ్‌ అన్నట్లుగానే ధోని విజయంతో ఆరంభించడం విశేషం.

కాగా ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం మూడింట గెలుపొందింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మిగిలి ఉన్న ఐదు మ్యాచ్‌లలో గెలిస్తే మొత్తంగా 16 పాయింట్లు వస్తాయి. నెట్‌రన్‌ రేటు కూడా భారీగా ఉండాలి. అయితే, ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ 16 పాయింట్లు సాధించగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌ 14 పాయింట్లు, రాజస్తాన్‌ రాయల్స్‌ 12 పాయింట్లు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 పాయింట్లతో టాప్‌-4లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చెన్నై ఒకవేళ ఐదింటికి ఐదు మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచినా ప్లే ఆఫ్స్‌ చేరాలంటే వీటి జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ చేరడం దాదాపు అసాధ్యం. ఇక సన్‌రైజర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు రవీంద్ర జడేజా నుంచి ధోని తిరిగి సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌ మ్యాచ్‌-46: సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్లు
చెన్నై-202/2 (20)
హైదరాబాద్‌-189/6 (20)

చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కీలక ఆటగాడు దూరం..!

మరిన్ని వార్తలు