IPL 2022: సన్‌రైజర్స్‌ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అందుకే ఇలా: సెహ్వాగ్‌

21 May, 2022 13:29 IST|Sakshi

Virender Sehwag Comments On David Warner IPL 2022 Form: డేవిడ్‌ వార్నర్‌.. ఐపీఎల్‌-2021లో ఘోర అవమానాలు ఎదుర్కొన్నాడు. అదే ఏడాది పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను తొలిసారిగా విజేతగా నిలడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. తనను అవమానించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

ఇక రిటెన్షన్‌లో భాగంగా హైదరాబాద్‌ వార్నర్‌ను వదిలేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌-2022 మెగా వేలంలో 6.25 ​కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఓపెనర్‌ బ్యాటర్‌ దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో 427 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్‌. అది కూడా సన్‌రైజర్స్‌పై.


ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(PC: IPL/BCCI)

వార్నర్‌ ఇలా చెలరేగుతుంటే.. మరోవైపు సన్‌రైజర్స్‌ దారుణ వైఫల్యాలతో టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆరంభంలో ఓటములు.. ఆ తర్వాత విజయాలు.. మళ్లీ పరాజయాలు.. దీంతో ఈ సీజన్‌లోనూ హైదరాబాద్‌ జట్టుకు నిరాశ తప్పలేదు. 

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్‌ వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. డేవిడ్‌ వార్నర్‌ను వదులుకుని అతిపెద్ద తప్పు చేసిందని విమర్శించాడు. 

అదే భారత కెప్టెన్‌ చేసి ఉంటే..
‘‘ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా వార్నర్‌ను వారు అట్టిపెట్టుకోవాల్సింది. ఒకవేళ భారత ఆటగాడైన కెప్టెన్‌ అతడిలా ఒకరికి మద్దతుగా స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఉంటే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టేవారు కాదు. తుది జట్టు నుంచి తొలగించేవారూ కాదు. వార్నర్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం మద్దతుగా నిలవాల్సింది.

అతడికి అండగా ఉండాల్సింది. ఒకవేళ వారు అలా చేసి ఉంటే వార్నర్‌ కచ్చితంగా సన్‌రైజర్స్‌తోనే ఉండేవాడు. ఏదేమైనా డేవిడ్‌ వార్నర్‌ను వదులుకుని సన్‌రైజర్స్‌ పెద్ద తప్పే చేసింది’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో వ్యాఖ్యానించాడు. 

ఒక్క సీజన్‌ సరిగ్గా ఆడనంత మాత్రాన ఆటగాడి పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నాడు. ప్రతి క్రికెటర్‌కు గడ్డు పరిస్థితులు సహజం అని, విరాట్‌ కోహ్లి చివరి మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి ఉండకపోతే.. ఈ సీజన్‌ తనకు చేదు జ్ఞాపకంగా మిగిలేదన్న వీరూ భాయ్‌... విఫలమైనంత మాత్రాన కోహ్లిని బెంగళూరు వదిలేయదు కదా అని వ్యాఖ్యానించాడు.

కానీ సన్‌రైజర్స్‌ మాత్రం ఆ తప్పు చేసిందని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ వార్నర్‌ దూసుకుపోతున్నాడని, తను మంచి ప్లేయర్‌ అంటూ సెహ్వాగ్‌ కొనియాడాడు. కాగా ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ శనివారం(మే 21) ముంబై ఇండియన్స్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక 2016లో వార్నర్‌ సారథ్యంలో హైదరాబాద్‌ టైటిల్‌ గెలిచిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చదవండి👉🏾RR Vs CSK: హెట్‌మెయిర్‌ భార్యను ప్రస్తావిస్తూ గావస్కర్‌ కామెంట్‌.. ‘మీకసలు బుద్ధుందా’ అంటూ..
చదవండి👉🏾IPL 2022-CSK: ఒక్క ఆటగాడు గాయపడితే.. ఇంత చెత్తగా ఆడతారా? ఆఖరి మ్యాచ్‌లోనూ..

Poll
Loading...
మరిన్ని వార్తలు