IPL 2022: కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. ఇద్దరూ అదరగొడుతున్నారు! హ్యాపీగా ఉంది!

29 Apr, 2022 14:38 IST|Sakshi
కుల్దీప్‌ యాదవ్‌- యజువేంద్ర చహల్‌(PC: IPL/BCCI)

టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ హర్షం

IPL 2022 Kuldeep Yadav- Yuzvendra Chahal: టీమిండియా స్పిన్‌ ద్వయం కుల్దీప్‌ యాదవ్‌- యజువేంద్ర చహల్‌ ఐపీఎల్‌-2022లో అదరగొడుతున్నారు. అత్యధిక వికెట్‌ వీరులకు ఇచ్చే పర్పుల్‌ క్యాప్ పోటీపడుతున్నారు.‌ఈ ఎడిషన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న కుల్దీప్‌ ఇద్దరూ ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడారు. 

చహల్‌ 18 వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్‌ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. కుల్దీప్‌ 17 వికెట్లతో అతడి వెనకాలే ఉన్నాడు. కాగా కుల్‌-చాగా పేరొందిన ఈ రిస్ట్‌ స్పిన్నర్‌ ద్వయం ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 

గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో భాగమైన కుల్దీప్‌నకు అసలు ఎక్కువగా ఆడే అవకాశమే రాలేదు. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన చహల్‌ 18 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో వీరిద్దరికి ఆయా ఫ్రాంఛైజీలు ఉద్వాసన పలికాయి. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా ఆర్సీబీతో అనుబంధం పెనవేసుకున్న చహల్‌ను ఆ ఫ్రాంఛైజీ వదిలేయడాన్ని అతడితో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఈ క్రమంలో మెగా వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ చహల్‌ కోసం పోటీపడి 6.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ను ఢిల్లీ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీరిద్దరు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కుల్‌-చా అద్భుత ఫామ్‌ టీమిండియాకు సానుకూల అంశంగా పరిణమించింది. వీరిద్దరు ఇలాగే రాణిస్తే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ చహల్‌, కుల్దీప్‌లను ట్విటర్‌ వేదికగా అభినందించాడు. ‘‘కఠిన పరిస్థితులు దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులను ఆపలేవు. అలాంటి వారిలో వీరిద్దరు కూడా ఉంటారు. కుల్‌-చా.. ఇద్దరూ ఫామ్‌లోకి రావడం భలే బాగుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

కాగా కేకేఆర్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా వసీం జాఫర్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశాడు. 

చదవండి👉🏾 Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా!
చదవండి👉🏾Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్‌ క్యాప్‌ అతడిదే: కుల్దీప్‌

మరిన్ని వార్తలు