IPL 2022: పంత్‌ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అసలు ఇలా ఎందుకు చేశాడో?

8 Apr, 2022 08:57 IST|Sakshi
ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(PC: IPL/ BCCI)

పంత్‌ కెప్టెన్సీపై పెదవి విరిచిన వసీం జాఫర్‌

IPL 2022 LSG Vs DC: లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలై ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. లక్నో బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ ఒంటి చేత్తో తమ జట్టును గెలిపించాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి కెప్టెన్సీపై పెదవి విరిచాడు. కీలక బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ సేవలు పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడంటూ విమర్శించాడు. 

ముఖ్యంగా అక్షర్‌ను కాదని పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన లలిత్‌ యాదవ్‌తో పూర్తి కోటా వేయించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. ఢిల్లీ సారథి చేసిన వ్యూహాత్మక తప్పిదంగా దీనిని జాఫర్‌ అభివర్ణించాడు. ఈ మేరకు వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో చర్చలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ అసలైన ట్రిక్‌ మిస్సయ్యాడు. పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ లలిత్‌ యాదవ్‌తో నాలుగు ఓవర్లు వేయించాడు.

కానీ అక్షర్‌ పటేల్‌ మాత్రం కేవలం రెండు ఓవర్లే వేశాడు. డికాక్‌ను అవుట్‌ చేయడానికి తను అస్త్రశస్త్రాలను ఉపయోగించి ఉండవచ్చు. నిజానికి అక్షర్‌ ఆ రెండు ఓవర్లు కూడా చాలా బాగా బౌల్‌ చేశాడు. కానీ తన పూర్తి కోటాను ఎందుకు పూర్తి చేయించలేదో నాకు అర్థం కాలేదు. నోబాల్స్‌ కారణంగా నోర్జేను పక్కన పెట్టారు. అలసు ఐదు నెలలుగా ఫామ్‌లో లేని, పరుగులు సమర్పించుకుంటున్న అతడితో ఎక్కువసేపు బౌలింగ్‌ చేయించడం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

ఇక బ్యాటింగ్‌లో ఆర్డర్‌లో రోవ్‌మన్‌ పావెల్‌ను మూడో స్థానంలో పంపడం ఢిల్లీ జట్టు చేసిన అతిపెద్ద తప్పిదమని వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. పావెల్‌ బదులు సర్ఫరాజ్‌ ఖాన్‌ను వన్‌డౌన్‌లో పంపాల్సిందని, అతడికి స్పిన్నర్లను ఎదుర్కోగల సత్తా ఉన్నందున ఢిల్లీ ఇంకాస్త ఎక్కువ స్కోరు చేయగలిగి ఉండేదని జాఫర్‌ పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అక్షర్‌ పటేల్‌ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

ఇక నోర్జే మాత్రం 2.2 ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. మరోవైపు.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ లలిత్‌ యాదవ్‌ 4 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇక బ్యాటర్లలో పావెల్‌(3 పరుగులు) పూర్తిగా వైఫల్యం చెందగా.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్‌ ఖాన్‌ 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చదవండి: IPL 2022: 'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్‌?!'

>
మరిన్ని వార్తలు