IPL 2022: లక్నో సూపర్‌ ‘సిక్సర్‌’

30 Apr, 2022 05:11 IST|Sakshi

జెయింట్స్‌ ఖాతాలో ఆరో విజయం

20 పరుగులతో పంజాబ్‌పై గెలుపు

లక్నో బౌలర్ల సమష్టి ప్రదర్శన  

పుణే: ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ దూసుకుపోతోంది. బ్యాటింగ్‌లో అద్భుతాలు చేయకపోయినా... ఈసారి బౌలర్ల చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమ్‌ కాపాడుకోగలిగింది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్‌ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. కగిసో రబడకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన కృనాల్‌ పాండ్యా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  

కీలక భాగస్వామ్యం...
సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ (6) అరుదైన వైఫల్యంతో లక్నో ఆట మొదలైంది. అయితే డికాక్, హుడా రెండో వికెట్‌కు 85 పరుగులు (59 బంతుల్లో) జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రబడ ఓవర్లో డికాక్‌ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఈ భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేస్తున్న తరుణంలో సందీప్‌ శర్మ దెబ్బ తీశాడు.

అతని బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి డికాక్‌ అవుటయ్యాడు. బౌలర్‌ అప్పీల్‌పై అంపైర్‌ స్పందించకపోయినా డికాక్‌ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మైదానం వీడాడు. ఇక్కడే లక్నో బ్యాటింగ్‌ తడబడింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు మరో 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. హుడా, కృనాల్‌ (7), బదోని (4), స్టొయినిస్‌ (1) పెవిలియన్‌ చేరారు. చివర్లో ఆరు బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు కొట్టిన సూపర్‌ జెయింట్స్‌ 150 పరుగుల స్కోరు దాటగలిగింది. వీటిలో రబడ ఓవర్లో వరుస బంతుల్లో చమీరా బాదిన రెండు సిక్స్‌లు ఉన్నాయి.  

సమష్టి వైఫల్యం...
మొహసిన్‌ ఓవర్లో 6, 4 తో ఛేదనను కెప్టెన్‌ మయాంక్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా మొదలు పెట్టాడు. అయితే చమీరా ఓవర్లోనూ సిక్స్‌ బాదిన అతను అదే ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం తక్కువ వ్యవధిలో శిఖర్‌ ధావన్‌ (5), రాజపక్స (9) వికెట్లను పంజాబ్‌ కోల్పోయింది. బెయిర్‌స్టోతో పాటు భారీ హిట్టర్‌ లివింగ్‌స్టోన్‌ (18) క్రీజ్‌లో ఉన్నంత వరకు కింగ్స్‌ గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా కనిపించలేదు. రవి బిష్ణోయ్‌ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన లివింగ్‌స్టోన్‌ జోరు ప్రదర్శించాడు కూడా. అయితే మొహసిన్‌ బౌలింగ్‌లో కీపర్‌ మీదుగా భిన్నమైన షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి అతను అవుటయ్యాడు. ఆ వెంటనే జితేశ్‌ శర్మ (2), గెలిపించే అవకాశం ఉన్న బెయిర్‌స్టో కూడా వెనుదిరగడంతో పంజాబ్‌ గెలుపు ఆశలకు కళ్లెం పడింది. చివర్లో రిషి ధావన్‌ (22 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ప్రయత్నం సరిపోలేదు.  

స్కోరు వివరాలు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డి కాక్‌ (సి) జితేశ్‌ (బి) సందీప్‌ శర్మ 46; రాహుల్‌ (సి) జితేశ్‌ (బి) రబడ 6; హుడా (రనౌట్‌) 34; కృనాల్‌ (సి) శిఖర్‌ (బి) రబడ 7; స్టొయినిస్‌ (సి అండ్‌ బి) చహర్‌ 1; బదోని (సి) లివింగ్‌స్టోన్‌ (బి) రబడ 4; హోల్డర్‌ (సి) సందీప్‌ (బి) చహర్‌ 11; చమీరా (సి) చహర్‌ (బి) రబడ 17; మొహసిన్‌ (నాటౌట్‌) 13; అవేశ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1–13, 2–98, 3–104, 4–105, 5–109, 6–111, 7–126, 8–144.
బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–23–0, సందీప్‌ శర్మ 4–0–18–1, రబడ 4–0–38–4, రిషి ధావన్‌ 2–0–13–0, లివింగ్‌స్టోన్‌ 2–0–23–0, రాహుల్‌ చహర్‌ 4–0–30–2.  

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) రాహుల్‌ (బి) చమీరా 25; శిఖర్‌ ధావన్‌ (బి) బిష్ణోయ్‌ 5; బెయిర్‌స్టో (సి) కృనాల్‌ (బి) చమీరా 32; రాజపక్స (సి) రాహుల్‌ (బి) కృనాల్‌ 9; లివింగ్‌స్టోన్‌ (సి) డికాక్‌ (బి) మొహసిన్‌ 18; జితేశ్‌ (ఎల్బీ) (బి) కృనాల్‌ 2; రిషి ధావన్‌ (నాటౌట్‌) 21; రబడ (సి) బదోని (బి) మొహసిన్‌ 2; చహర్‌ (సి) బదోని (బి) మొహసిన్‌ 4; అర్‌‡్షదీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–35, 2–46, 3–58, 4–88, 5–92, 6–103, 7–112, 8–117.
బౌలింగ్‌: మొహసిన్‌ 4–1–24–3, చమీరా 4–0–17–2, హోల్డర్‌ 1–0–8–0, అవేశ్‌ ఖాన్‌ 3–0–26–0, రవి బిష్ణోయ్‌ 4–0–41–1, కృనాల్‌ పాండ్యా 4–1–11–2.   

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ టైటాన్స్‌ X బెంగళూరు
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
రాజస్తాన్‌ రాయల్స్‌ X ముంబై ఇండియన్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు