IPL 2023: రిషబ్‌ పంత్‌ స్థానంలో బెంగాల్‌ సంచలనం!

29 Mar, 2023 13:06 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ పలు సర్జరీల అనంతరం కోలుకుంటున్నాడు. పంత్‌ కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలకు పైగా పట్టే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. వైస్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వ్యవహరించనున్నాడు.

అయితే పంత్‌ స్థానంలో మాత్రం ఇప్పటివరకు ఎవరిని ఎంపిక చేయని ఢిల్లీ ఫ్రాంచైజీ తాజాగా బెంగాల్‌ సంచలనం.. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.  అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించాల్సి ఉంది. ఇక అభిషేక్‌ పోరెల్‌ బెంగాల్‌ తరపున 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 695 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఐపీఎల్‌లో నాయకుడిగా వార్నర్‌కు ఘనమైన రికార్డు ఉంది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌ 67 మ్యాచ్‌ల్లో 35 విజయాలు అందుకున్నాడు. అంతేకాదు ఎస్‌ఆర్‌హెచ్‌కు 2016లో ఐపీఎల్‌ టైటిల్‌ కూడా అందించాడు. తాజాగా అతని నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి టైటిల్‌ కొట్టబోతుందని జట్టు హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

''పంత్‌ ఐపీఎల్‌కు ఫిజికల్‌గా దూరమైనప్పటికి అతను మాతోనే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాం.. అతని టీషర్ట్‌ నెంబర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీపై ప్రత్యేకంగా ముద్రించాలనుకుంటున్నాం'' అంటూ పాంటింగ్‌ తెలిపాడు. ఇక పంత్‌ స్థానంలో అభిషేక్‌ పోరెల్‌ను ఎంపిక చేసినప్పటికి అతనికి తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. దేశవాలీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇక గతేడాది డిసెంబర్‌లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు నిర్వహించగా ప్రస్తుతం పంత్‌ కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా పంత్‌ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్‌గిడి ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్

చదవండి: చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం

తండ్రి మిస్సింగ్‌ కేసులో క్రికెటర్‌కు ఊరట

>
మరిన్ని వార్తలు