#Ambati Rayudu: అరుదైన ఘనత.. ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: రాయుడు భావోద్వేగం

30 May, 2023 11:41 IST|Sakshi
అంబటి రాయుడు (PC: IPL)

IPL 2023- Ambati Rayudu: ‘‘అవును.. ఐపీఎల్‌ కెరీర్‌ అద్భుతంగా ముగిసింది. ఇంతకంటే నాకింకేం కావాలి. అసలు ఇది నమ్మశక్యంగా లేదు. ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశాడు.

కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్‌ కెరీర్‌ ముగించాడు.

చెన్నై ఐదోసారి.. రాయుడు ఖాతాలో ఆరు
ఐపీఎల్‌-2023 ఫైనల్‌కు ముందు తాను క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌ బై చెప్పనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా చెన్నై- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మే 28న జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు మారింది. ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. దీంతో రాయుడు ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు ఇంతకంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదని వ్యాఖ్యానించాడు.

మా నాన్న వల్లే
చెన్నై విజయానంతరం కామెంటేటర్‌ హర్షా భోగ్లేతో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇక నేనిలాగే జీవితాంతం చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోవచ్చు. గత 30 ఏళ్లుగా హార్డ్‌వర్క్‌ చేస్తున్నా. నా ప్రయాణంలో నాకు సహాయసహకారాలు అందించిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా నాన్నకు ధన్యవాదాలు చెప్పాలి. 

వాళ్ల మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్‌లో అంబటి రాయుడు మొత్తంగా 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 158 పరుగులు సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు.


Photo Credit : AFP

రోహిత్‌ శర్మ తర్వాత
రాయుడు ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా రిజర్వ్‌ డే మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

చదవండి: జడేజాను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్‌! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్‌ 
ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్‌

మరిన్ని వార్తలు