ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

23 Mar, 2023 16:46 IST|Sakshi

ఐపీఎల్‌ 2023 ప్రారంభానికి ముందు టూ టైమ్‌ ఛాంపియన్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను సమస్య కారణంగా ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ లీగ్‌ మొత్తానికే దూరం కాగా.. తాజాగా స్టార్‌ బౌలర్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు లోకీ ఫెర్గూసన్‌ గాయం (హ్యామ్‌స్ట్రింగ్‌) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు ముందు ఫెర్గూసన్‌ గాయం వార్త వెలుగు చూసింది.

దీంతో అతను మార్చి 25న జరిగాల్సిన తొలి వన్డే బరి  నుంచి తప్పుకున్నాడు. అతని​ స్థానంలో కివీస్‌ క్రికెట్‌ బోర్డు ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంకతో తొలి వన్డేకు మాత్రం ఫెర్గూసన్‌ దూరంగా ఉంటాడని కివీస్‌ యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఫెర్గూసన్‌ గాయం తీవ్రతపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కానీ కేకేఆర్‌ యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.  

ఒకవేళ ఫెర్గూసన్‌ గాయం బారిన పడకుండి ఉంటే, తొలి వన్డే తర్వాత ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌కు పయనమవ్వాల్సి ఉండింది. ఫెర్గూసన్‌ గాయంపై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో కేకేఆర్‌ యాజమాన్యం కలవర పడుతుంది. ఇప్పటికే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సేవలు కోల్పోయిన ఆ జట్టు, ఫెర్గూసన్‌ సేవలను కూడా కోల్పోతే భారీ మూల్యం తప్పదని భావిస్తుంది.

ఫెర్గూసన్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా పేస్‌ బౌలింగ్‌ భారమంతా టిమ్‌ సౌథీపై పడుతుంది. ఐపీఎల్‌ 2023 ప్రారంభానికి మరో 8 రోజులు మాత్రమే ఉన్నా కేకేఆర్‌ ఇప్పటికీ తమ నూతన కెప్టెన్‌ పేరును (శ్రేయస్‌ రీప్లేస్‌మెంట్‌) ప్రకటించలేదు. కాగా, ఫెర్గూసన్‌ గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2023 వేలంలో కేకేఆర్‌ అతన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్‌ ఏప్రిల్‌ 2న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.  
 

మరిన్ని వార్తలు