IPL 2023: బెంగళూరు చిన్నబోయింది! పరుగుల వరద పారిన పోరులో ఓడిన ఆర్‌సీబీ

18 Apr, 2023 04:06 IST|Sakshi

8 పరుగులతో చెన్నై గెలుపు

కాన్వే, దూబే మెరుపులు

మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్‌ శ్రమ వృథా   

బెంగళూరు: పరుగుల వరద పారిన పోరు... ఏకంగా 33 సిక్సర్లు నమోదు... చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) భారీ స్కోరు సాధిస్తే మేమేం తక్కువ అన్నట్లుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కూడా విరుచుకుపడింది. అయితే తుది ఫలితంలో మాత్రం సూపర్‌ కింగ్స్‌దే పైచేయి అయింది. ఒకదశలో గెలుపు ఖాయమనిపించిన ఆర్‌సీబీ ఓటమి బాట పట్టడంతో చిన్నస్వామి మైదానంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, అజింక్య రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు.  

సమష్టి ప్రదర్శన...
సిరాజ్‌ తొలి ఓవర్లోనే రుతురాజ్‌ (3) అవుట్‌ కావడంతో చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. అయితే రహానే, కాన్వే భాగస్వామ్యంలో స్కోరు జోరందుకుంది. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో స్కోరు 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులకు చేరింది. హసరంగ తన తొలి ఓవర్లో చక్కటి బంతితో రహానేను బౌల్డ్‌ చేయడంతో 74 పరుగుల (43 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ తర్వాత కాన్వే, దూబే మరింత ధాటిగా పరుగులు సాధించారు. వైశాక్‌ ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టగా, సిరాజ్‌ ఓవర్లో దూబే ఫోర్, సిక్స్‌ బాదాడు.

వైశాక్‌ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 19 పరుగులు రాబట్టారు. కాన్వే 32 బంతుల్లో, దూబే 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 80 పరుగులు (37 బంతుల్లో) జోడించిన వీరిద్దరు ఎనిమిది బంతుల వ్యవధిలో వెనుదిరిగినా... చివర్లో అంబటి రాయుడు (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (9 బంతుల్లో 19 నాటౌట్‌; 2 సిక్స్‌లు) వేగంగా ఆడి కీలక పరుగులు జోడించారు. దాంతో ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై జట్టు 25వసారి 200 అంతకంటే ఎక్కువ స్కోరు చేసింది.  

శతక భాగస్వామ్యం...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీకి షాక్‌ తగిలింది. ఆకాశ్‌ సింగ్‌ తొలి ఓవర్లోనే కోహ్లి (6) షాట్‌ను వికెట్లపైకి ఆడుకోగా, ఆ వెంటనే లోమ్రోర్‌ (0) వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ అద్భుత భాగస్వామ్యం జట్టును నడిపించింది. వీరిద్దరు చెన్నై బౌలర్లందరిపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించారు. ‘సున్నా’ వద్ద డుప్లెసిస్‌ క్యాచ్‌ను ధోని వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆకాశ్‌ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ 2 సిక్స్‌లు బాదగా, అతని తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు.

తుషార్‌ ఓవర్లో డుప్లెసిస్‌ వరుస బంతుల్లో 4, 4, 6... తీక్షణ ఓవర్లో మ్యాక్సీ 2 సిక్స్‌లు కొట్టడంతో ఆరు ఓవర్లలోనే స్కోరు 75 పరుగులకు చేరింది. ఈ క్రమంలో డుప్లెసిస్‌ 23 బంతుల్లో, మ్యాక్స్‌వెల్‌ 24 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నారు. 12వ ఓవర్‌ వరకు వీరి ధాటి కొనసాగింది. అయితే వరుస ఓవర్లలో వీరిద్దరిని అవుట్‌ చేయడంతో చెన్నైకి మళ్లీ పట్టు చిక్కింది. ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) గెలిపించేందుకు ప్రయత్నించినా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఉత్కంఠ క్షణాలను దాటి మ్యాచ్‌ను కాపాడుకుంది.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) పార్నెల్‌ (బి) సిరాజ్‌ 3; కాన్వే (బి) హర్షల్‌ 83; రహానే (బి) హసరంగ 37; దూబే (సి) సిరాజ్‌ (బి) పార్నెల్‌ 52; రాయుడు (సి) కార్తీక్‌ (బి) వైశాక్‌ 14; అలీ (నాటౌట్‌) 19; జడేజా (సి) (సబ్‌) ప్రభుదేశాయ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 10; ధోని (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226.
వికెట్ల పతనం: 1–16, 2–90, 3–170, 4–178, 5–198, 6–224.
బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–30–1, పార్నెల్‌ 4–0–48–1, వైశాక్‌ 4–0–62–1, మ్యాక్స్‌వెల్‌ 2.4–0–28–1, హసరంగ 2–0–21–1, హర్షల్‌ పటేల్‌ 3.2–0–36–1.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) ఆకాశ్‌ 6; డుప్లెసిస్‌ (సి) ధోని (బి) అలీ 62; లోమ్రోర్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) ధోని (బి) తీక్షణ 76; షహబాజ్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 12; కార్తీక్‌ (సి) తీక్షణ (బి) తుషార్‌ 28; ప్రభుదేశాయ్‌ (సి) జడేజా (బి) పతిరణ 19; పార్నెల్‌ (సి) దూబే (బి) తుషార్‌ 2; హసరంగ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218.
వికెట్ల పతనం: 1–6, 2–15, 3–141, 4–159, 5–191, 6–192, 7–197, 8–218.
బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 3–0–35–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–45–3, తీక్షణ 4–0–41–1, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–42–2, మొయిన్‌ అలీ 1–0–13–1.

మరిన్ని వార్తలు