Aiden Markram: ఒక్కోసారి అలా జరుగుతుంది.. బాధపడాల్సిన అవసరం లేదు.. వాళ్లిద్దరి వల్లే ఇలా! ఇకపై..

30 Apr, 2023 10:08 IST|Sakshi
ఢిల్లీపై రైజర్స్‌ విజయం (PC: IPL Twitter)

IPL 2023- SRH Won by 9 Runs On Delhi Capitals: ‘‘జట్టు సమష్టి ప్రదర్శన కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. మా ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలకు తోడు గెలవాలన్న వారి పట్టుదలే ఇక్కడిదాకా తీసుకువచ్చింది. మనం సరైన వ్యూహాలు రచించినపుడు కూడా ఒక్కోసారి ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇలాంటి ఫలితాలు దక్కుతాయి. సరైన సమయంలో రాణించి మా జట్టు విజయం అందుకుంది’’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రైజర్స్‌ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

ఆఖరి ఓవర్‌ వరకు నువ్వా- నేనా అన్నట్లు శనివారం హోరాహొరీగా సాగిన పోరులో ఎట్టకేలకు మార్కరమ్‌ బృందం 9 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై ఢిల్లీని ఓడించి ఉప్పల్‌లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకుంది.

అదరగొట్టిన అభిషేక్‌, క్లాసీ క్లాసెన్‌
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (36 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 67 పరుగులు) మినహా టాపార్డర్‌ పూర్తిగా విఫలమైనప్పటికీ.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

దంచికొట్టిన సాల్ట్‌, మిచెల్‌
ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌(28 పరుగులు), అకీల్‌ హొసేన్‌ (16 పరుగులు నాటౌట్‌) తమ వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 6 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి రైజర్స్‌ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆరంభంలోనే షాకిచ్చినప్పటికీ.. ఫిలిప్‌ సాల్ట్‌(59), మిచెల్‌ మార్ష్‌(63) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.

అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (14 బంతుల్లో 29 పరుగులు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో వార్నర్‌ బృందానికి రైజర్స్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఢిల్లీపై గెలుపుతో సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో మూడో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

వాళ్లిద్దరు అద్భుతం.. మా బౌలర్లు కూడా
ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్‌ కెప్టెన్‌ మార్కరమ్‌ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ ఆరంభం నుంచి అదరగొట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న క్లాసీ(క్లాసెన్‌) అతడికి తోడయ్యాడు. ఆత్మవిశ్వాసంతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. మాకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది.

మా బౌలర్లు పట్టుదలగా నిలబడ్డారు. ప్రత్యర్థి ఆట కట్టించారు. ఈ విజయం మాలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక సొంతగడ్డపై కూడా విజయపరంపర ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నాం​’’ అని పేర్కొన్నాడు. కాగా మే 4న సన్‌రైజర్స్‌ ఉప్పల్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు పుజారా వార్నింగ్‌.. 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు
DC VS SRH: ప్రపంచంలో ఇతనికి మించిన ఆల్‌రౌండర్‌ లేడు.. ఓడినా పర్లేదు..!

మరిన్ని వార్తలు