#Arshdeep Singh: మంచి బౌలరే! కానీ ఇదేంటి? ఇలాగే కొనసాగితే: మాజీ క్రికెటర్‌ విమర్శలు

4 May, 2023 11:29 IST|Sakshi
అర్ష్‌దీప్‌ సింగ్‌ (PC: IPL/BCCI)

IPL 2023 PBKS Vs MI: సొంతమైదానంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌  అర్ష్‌దీప్‌ సింగ్‌కు పీడకలను మిగిల్చింది. మొహాలీ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

మంచి బౌలరే.. కానీ ఇదేంటి?
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా అర్ష్‌దీప్‌ ఆట తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్ష్‌ అద్భుత బౌలర్‌ అయినప్పటికీ.. ప్రతిసారి ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నాడు. అతడి బౌలింగ్‌ విధానం చూస్తుంటే ఒత్తిడిలో కూరుకుపోయి.. ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.

ఆత్మవిశ్వాసం సన్నగిల్లి
‘‘పంజాబ్‌ బౌలింగ్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గత మ్యాచ్‌ల ఫలితాలు ఇందుకు నిదర్శనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే జట్టుకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌ లాంటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

అతడు గత మ్యాచ్‌లలో కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరిచాడు. అతడిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు అనిపిస్తోంది. అయితే, ఇలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు తన నైపుణ్యాలకు పదునుపెడితే తిరిగి పుంజుకోగలడు.

అతనొక్కడే కాదు
నిజానికి అర్ష్‌దీప్‌ ఒక్కడే కాదు.. పంజాబ్‌ బౌలింగ్‌ విభాగం మొత్తం స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడుతోంది’’ అని క్రిక్‌బజ్‌ షోలో దీప్‌దాస్‌ గుప్తా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా మొహాలీ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు నష్టపోయి 214 పరుగులు సాధించింది.

వాళ్లిద్దరి అద్భుత బ్యాటింగ్‌తో
కానీ బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా భారీ స్కోరును సైతం కాపాడులేకపోయింది. రిషి ధావన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఆరంభంలోనే అవుట్‌ చేసి శుభారంభం అందించినా.. మిగతా వాళ్లు దానిని కొనసాగించలేకపోయారు. ముంబై బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ దంచికొట్టడంతో ఏడు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ ఓటమి ఖరారైంది.

ఎవరెలా?
ఈ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇషాన్‌(75) వికెట్‌ను అర్ష్‌దీప్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అర్ష్‌ తర్వాత సామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. 3 ఓవర్లలో అతడు ఏకంగా 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. మిగిలిన వాళ్లలో రిషికి ఒకటి, నాథన్‌ ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో అర్ష్‌దీప్‌ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 361 పరుగులు ఇచ్చి 16 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

చదవండి: Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్‌ వైరల్‌! రియల్‌ బాస్‌ ఎవరంటే!
తన బ్యాటింగ్‌ పవర్‌ ఎలాంటిదో మరోసారి చూశాం.. కానీ: రోహిత్‌

మరిన్ని వార్తలు