-

IPL 2023 DC VS MI: బోణీ కొట్టని జట్ల మధ్య పోటీ.. గెలుపెవరిది..? అర్జున్‌ ఎంట్రీ పక్కా..!

11 Apr, 2023 14:12 IST|Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 11) మరో రసవత్తర సమరంగా జరుగనుంది. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్‌- ముంబై ఇండియన్స్‌ జట్లు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.

ఈ మ్యాచ్‌లో గెలపెవరిది అన్న విషయాన్ని విశ్లేషిస్తే.. ప్రస్తుత జట్ల సమీకరణల దృష్ట్యా ఢిల్లీకే విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇదే రిజల్ట్‌ వస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పలేము. గత రెండ్రోజులుగా నడుస్తున్న ట్రెండ్‌ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. గెలుస్తాయనుకున్న జట్లు ఓడాయి, ఓడిపోతాయనుకున్న జట్లు సంచలన విజయాలు నమోదు చేశాయి.

గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు క్షణాల వ్యవధిలో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ (ఆఖరి 5 బంతులకు 5 సిక్సర్లు), ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో ఆటగాడు పూరన్‌ (15 బంతుల్లో 50) ఓడతాయనుకున్న తమ జట్లను ఒంటిచేత్తో గెలిపించారు.

ఎంఐ-డీసీ మ్యాచ్‌ విషయానికొస్తే.. జట్ల బలాబలాల పరంగా చూస్తే ముంబైతో పోలిస్తే డీసీ కాస్త బలంగా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే, ముంబైతో పోలిస్తే డీసీ ప్రదర్శన కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. ముంబై బ్యాటర్లు (తిలక్‌ వర్మ మినహా) తామాడిన రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు.

డీసీ బ్యాటర్లు సైతం తామాడిన 3 మ్యాచ్‌ల్లో ఇదే పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. వార్నర్‌, రొస్సో కాస్త పర్వాలేదనిపించారు. బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ముంబై కంటే డీసీ ఆటగాళ్లే బెటర్‌గా ఉన్నారు. ముంబై బౌలింగ్‌ విభాగమంతా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. ఇదొక్కటి చాలు ముంబై బౌలింగ్‌ ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి.

మరో పక్క డీసీ బౌలింగ్‌ విభాగం ముంబైతో పోలిస్తే చాలా బెటర్‌ అని చెప్పాలి. ఆ జట్టు స్పిన్నర్లు అక్షర్‌, కుల్దీప్‌ అద్భుతంగా రాణిస్తుండగా, పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, నోర్జే పర్వాలేదనిపిస్తున్నారు. ఎలా చూసినా ముంబైతో పోలిస్తే డీసీనే మెరుగ్గా ఉంది కాబట్టి, ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉండే ఛాన్స్‌ ఉంది. అంతేకాక డీసీకి సొంత మైదానంలో ఆడుతుండటం అదనంగా కలిసి వస్తుంది.

ఒకవేళ బ్యాటింగ్‌లో  రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ చెలరేగితే మాత్రం ముంబైను ఆపడం​ ఎవరి తరం కాదు. ఆర్చర్‌ మినహా నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్‌ లేకపోవడం ముంబైకి అతి పెద్ద మైనస్‌ అని చెప్పవచ్చు. అలాగని స్పిన్‌ విభాగం సైతం ఏమంత బలంగా లేదు. 

ఇక ఈ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌లో పలు మార్పులు చేయవచ్చు. సీఎస్‌కేతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆర్చర్‌ నేడు బరిలోకి దిగవచ్చు. గత మ్యాచ్‌లో ఆడిన అర్షద్‌ ఖాన్‌పై వేటు వడవచ్చు. అతని స్థానంలో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ తుది జట్టులోకి రావచ్చు. బ్యాటింగ్‌ విభాగంలో ట్రిస్టస్‌ స్టబ్స్‌ స్థానంలో డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఆడేందుకు అవకాశాలు ఎక్కుగా ఉన్నాయి. 

డీసీ విషయానికొస్తే.. ఈ జట్టులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. రాజస్థాన్‌తో ఆడిన జట్టునే డీసీ యాజమాన్యం యధాతథంగా బరిలో​కి దించవచ్చు. గత 3 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పృథ్వీ షాపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో  యశ్‌ ధుల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. వికెట్‌కీపర్‌ కోటాలో సర్ఫరాజ్‌ అహ్మద్‌కు లాస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

తుది జట్లు (అంచనా)..

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా/యశ్‌ ధుల్‌, డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), మనీశ్‌పాండే, రిలీ రొస్సో, అభిషేక్‌ పోరెల్‌/సర్ఫరాజ్‌ అహ్మద్‌ (వికెట్‌కీపర్‌), లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రోవ్‌మన్‌ పావెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, నోర్జే, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌  

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌, కెమారూన్‌ గ్రీన్‌, సూర్యుకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, జోఫ్రా ఆర్చర్‌, అర్జున్‌ టెండూల్కర్‌, పియుశ్‌ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్‌, కుమార్‌ కార్తికేయ

మరిన్ని వార్తలు