IPL 2023: హోంగ్రౌండ్‌లో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లకు పంత్‌!

31 Mar, 2023 11:44 IST|Sakshi

టీమిండియా ఆటగాడు రిషబ్‌ పంత్‌ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు పంత్‌ దూరమయ్యాడు. అతను లేని లోటును మరో రకంగా (జట్టుతో పాటు డగౌట్‌లో అతను ఉండడం లేక అతని జెర్సీ నెంబర్‌ ఉన్న టీషర్ట్‌ను ఆటగాళ్లు ధరించేలా) తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ భావించింది. ఈ మేరకు ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ)రంగంలోకి దిగింది. పంత్‌కు అభ్యంతరం లేకపోతే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ హోం గ్రౌండ్‌ అయిన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆడే మ్యాచ్‌లను వీక్షించేందుకు డగౌట్‌లో ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని డీడీసీఏ తెలిపింది.

డీడీసీఏ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ మాట్లాడుతూ.. ''ఐపీఎల్‌ 16వ సీజన్‌ పంత్‌ ఆడకపోయినా డగౌట్‌లో ఉంటే బాగుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్‌ భావిస్తోంది. అందుకే మేము ఒక ఆలోచన చేశాం. పంత్‌ గ్రౌండ్‌లో ఉంటే కంపర్ట్‌గా ఫీలవుతాడంటే అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. అతన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక మెడికల్‌ టీం సహా ఇంటి నుంచి స్టేడియానికి తీసుకురావడానికి ప్రత్యేక ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయం కూడా కల్పిస్తాం. పంత్‌ దీనికి ఒప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ డగౌట్‌లో అతని కోసం ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది.'' అని చెప్పుకొచ్చాడు. 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా పంత్‌ విషయమై తెగ ఫీలయ్యాడు. పంత్‌ లేని లోటు మాకు తెలుస్తుందని.. అతను ఐపీఎల్‌కు దూరమైనప్పటికి ఏదో ఒకలా అతను జట్టుతో పాటు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటామని తెలిపాడు. అందుకు పంత్‌ జెర్సీ నెంబర్‌తో కూడిన టీషర్ట్‌లను ప్రత్యేకంగా తయారు చేయించి జట్టు మొత్తం ధరించేలా చూస్తామన్నాడు. అవసరమైతే పంత్‌ను డగౌట్‌లో కూర్చొబెట్టి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పిస్తాం. అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. తాజాగా డీడీసీఏ ప్రకటన పాంటింగ్‌ కలను నిజం చేసేలా కనిపిస్తుంది. 

గతేడాది డిసెంబర్‌లో రిషబ్‌ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్‌ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు.యాక్సిడెంట్‌తో ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యే చాన్స్‌ ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌కు దూరం కావడంతో పంత్‌ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్‌ కోల్పోయింది. పంత్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. వైస్‌కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ వ్యహరించనున్నాడు.

ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వార్నర్‌కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్‌ స్థానంలో అభిషేక్‌ పోరెల్‌ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ తెలిపింది.  ఏప్రిల్‌ ఒకటిన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది.

చదవండి: IPL 2023: ఆ జట్టు బాగుంది.. ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండు: రిక్కీ పాంటింగ్‌

IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!

>
మరిన్ని వార్తలు