IPL 2023: ధోని బాగా ఆడాలి.. కానీ ముంబై గెలవాలి! గెలుస్తుంది కూడా! అంతలేదు..

8 Apr, 2023 13:32 IST|Sakshi
ఎంఎస్‌ ధోని- రోహిత్‌ శర్మ (PC: IPL)

IPL 2023- MI Vs CSK Winner Prediction: గతేడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో భారీ ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నాయి మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై 14కు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఇక రోహిత్‌ సేన దారుణ వైఫల్యం సంగతి ఇలా ఉంటే.. ధోని సారథ్యంలో నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సీఎస్‌కే పరిస్థితి కూడా అంతే చెత్తగా ఉంది. తొలుత టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చెన్నై పగ్గాలు అప్పగించగా.. వరుస ఓటముల నేపథ్యంలో అతడు మధ్యలోనే తప్పుకొన్నాడు.

దీంతో మళ్లీ మహేంద్ర సింగ్‌ ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబైలాగే నాలుగు మ్యాచ్‌లే గెలిచినా కాస్త మెరుగైన రన్‌రేటుతో తొమ్మిదో స్థానంలో నిలిచింది సీఎస్‌కే.

పంతం నీదా- నాదా సై అంటున్న ముంబై, సీఎస్‌కే
ఈ క్రమంలో ఐపీఎల్‌-2023 ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిన ధోని సేన.. సొంత మైదానం చెపాక్‌లో మాత్రం సత్తా చాటింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించి గెలుపు బోణీ కొట్టింది. 

ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్‌ చెన్నై మాదిరే ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించింది. బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ముంబై- సీఎస్‌కే మధ్య శనివారం(ఏప్రిల్‌ 8) నాటి పోరు ఆసక్తికరంగా మారింది.

ధోని సేన మరో గెలుపు నమోదు చేస్తుందా? లేదంటే ముంబై సొంతగడ్డపై పైచేయి సాధిస్తుందా అన్న విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ధోని బాగా ఆడాలి.. కానీ ముంబై గెలవాలి
బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్ షోలో పఠాన్‌ మాట్లాడుతూ.. ‘‘ముంబైలో ఉన్న క్రికెట్‌ అభిమానులు.. ఎంఎస్ ధోని తన అద్భుత ప్రదర్శనతో తమకు వినోదం పంచాలని ఆశిస్తారు. అయితే, అదే సమయంలో ముంబై ఇండియన్స్‌ను విజయం వరించాలని కోరుకుంటారు.

ఏదేమైనా సొంతమైదానంలో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం అంత సులువేమీ కాదు. గతంలో వాంఖడేలో సీఎస్‌కే, ముంబై జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే అందులో ఏడుసార్లు ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. 

ముంబైదే విజయం.. అంతలేదు సీఎస్‌కేను ఓడించాలంటే
గణాంకాలను బట్టి చూస్తే చెన్నైపై ముంబై కచ్చితంగా గెలిచి తీరుందని స్పష్టమవుతోంది. ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరడం ఖాయం’’ అని అంచనా వేశాడు. ఇక యూసఫ్‌ సోదరుడు, టీమిండియా మాజీ ప్లేయర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం సొంతమైదానంలో ఆడుతున్నందున రోహిత్‌ సేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంటే టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ మాత్రం.. ‘‘సొంతగడ్డపై ముంబై బలం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. కానీ.. ఏ గ్రౌండ్‌లోనైనా సీఎస్‌కేను ఓడించాలంటే చెమటోడ్చక తప్పదు’’  అని చెప్పుకొచ్చాడు.

చదవండి: రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్‌ 
సీఎస్‌కేతో మ్యాచ్‌.. సచిన్‌ కొడుకు ఐపీఎల్‌ ఎం‍ట్రీ! 

మరిన్ని వార్తలు