IPL 2023- MS Dhoni: మా ఓటమికి కారణం అదే: ధోని! కొంపముంచిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’!

1 Apr, 2023 09:45 IST|Sakshi
తొలి మ్యాచ్‌లో చెన్నై ఓటమి (Photo Credit: CSK Twitter/IPL)

Gujarat Titans vs Chennai Super Kings- MS Dhoni Over Loss: ‘‘పిచ్‌పై డ్యూ (తేమ) ఉందని అందరికీ తెలుసు. అయినా మా బ్యాటర్లు మరింత మెరుగ్గా రాణించాల్సింది. మరిన్ని పరుగులు స్కోరు చేయాల్సింది. ఏదేమైనా రుతరాజ్‌ అదరగొట్టాడు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 

తన బ్యాటింగ్‌ కన్నుల పండుగగా అనిపించింది. తన షాట్‌ సెలక్షన్‌ సూపర్‌. యువ ఆటగాళ్లంతా ఇలాగే ముందుకు సాగితే బాగుంటుంది. ఇక రాజ్‌ బాగానే బౌలింగ్‌ చేశాడు. కానీ ఇంకాస్త మెరుగుపడాలి. అనుభవం గడిస్తున్న కొద్దీ తను రాణించగలడు.

ఇక నోబాల్స్‌ అనేవి మన నియంత్రణలో ఉండేవే! కాబట్టి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బౌలర్‌పై ఉంటుంది’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నాడు. బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌-2023 ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

రుతు అదుర్స్‌.. కానీ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 50 బంతుల్లో 92 పరుగులు సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొయిన్‌ అలీ 23 పరుగులు చేయగలిగాడు. మిగతా వాళ్లు కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు.


PC: IPL/BCCI

కొంప ముంచాడు!
లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 63 పరుగులతో అద్బుత ఆరంభం అందించగా.. ఆఖర్లో వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్‌ కారణంగా హార్దిక్‌ సేన 19.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే(ఇంపాక్ట్‌ ప్లేయర్‌) 3.2 ఓవర్లలోనే ఏకంగా 51 పరుగులు ఇవ్వడం కొంపముంచింది. మిగతా వాళ్లలో రాజ్‌వర్దన్‌ హంగేర్గకర్‌ మూడు వికెట్లతో మెరవగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్‌ తీశాడు.

ఇదిలా ఉంటే.. రెండు వికెట్లతో మెరిసి.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన గుజరాత్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఓటమిపై ధోని పైవిధంగా స్పందించాడు.

చదవండి: GT Vs CSK: చెన్నై పేసర్‌ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! గుజరాత్‌ కూడా..
IPL 2023: రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసం.. 9 సిక్స్‌లు, 4 ఫోర్లతో! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు