IPL Cheerleaders Income!: క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. చీర్‌లీడర్స్‌ ఆదాయమెంతో తెలుసా? ఒక్కో మ్యాచ్‌కు అత్యధికంగా చెల్లిస్తున్న ఫ్రాంఛైజీ ఏదంటే!

7 Apr, 2023 20:52 IST|Sakshi
చీర్‌లీడర్స్‌ (Photo Credit: PTI)

క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. ఐపీఎల్‌ అంటేనే కాసుల వర్షం.. వేలం సందర్భంగా ఇప్పుడిప్పుడే కెరీర్‌ మొదలుపెడుతున్న ప్రతిభావంతులు మొదలు.. స్టార్‌ ప్లేయర్లపై వేలంలో కనక వర్షం కురవడం షరా మామూలే!

ఇక పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాగ్జిమమ్‌ సిక్స్‌లు.. అద్భుత రీతిలో వికెట్లు పడ్డప్పుడు.. ఊహించని క్యాచ్‌లు అందుకున్నపుడు.. ఇలా ప్రతీ కీలక మూమెంట్‌లో ఆయా జట్లను ఉత్సాహపరుస్తూ చీర్‌లీడర్స్‌ చేసే సందడి అంతా ఇంతా కాదు!

తమదైన శైలిలో హుషారైన స్టెప్పులతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకూ కనువిందు చేస్తూ ఉంటారు చీర్‌లీడర్స్‌. మరి ఒక్కో మ్యాచ్‌కు వారు అందుకునే మొత్తం, చీర్‌లీడర్స్‌కు అధిక మొత్తం చెల్లిస్తున్న ఫ్రాంఛైజీ ఏదో తదితర వివరాలు పరిశీలిద్దాం.

ఒక్కో మ్యాచ్‌కు కనీసం  ఎంతంటే
డీఎన్‌ఏ రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్‌ చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు సగటున 12,000 రూపాయల నుంచి 17 వేల వరకు ఫ్రాంఛైజీలు చెల్లిస్తాయట. ఇక క్రిక్‌ఫాక్ట్స్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ చీర్‌లీడర్స్‌కు అత్యధిక మొత్తం చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అత్యధికంగా ఒక్కో మ్యాచ్‌కు రూ. 24 వేలు పారితోషకంగా కేకేఆర్‌ అందిస్తోందట.

అత్యధికంగా చెల్లించే ఫ్రాంఛైజీ ఏదంటే
ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ చీర్‌లీడర్స్‌కు మ్యాచ్‌కు 12 వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. కాగా అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌కు పనిచేస్తున్న చీర్‌లీడర్స్‌కు ఒక్కో మ్యాచ్‌కు 20 వేల రూపాయల చొప్పున ముట్టజెప్తున్నారట.

అదే విధంగా రాయల​ చాలెంజర్స్‌ బెంగళూరు సైతం ముంబై మాదిరే 20 వేలు చెల్లిస్తోందట. ఇలా చీర్‌లీడర్స్‌ ఒక్కో మ్యాచ్‌కు ఈ మేరకు నగదు అందుకోవడమే కాకుండా.. విలాసవంతమైన హోటళ్లలో బస, రుచికరమైన భోజనంతో ఇతర సదుపాయాలు కూడా పొందుతున్నారు.

అంత తేలికేం కాదు
ఏంటీ.. ఇదంతా వింటుంటే చీర్‌లీడర్స్‌ పనే బాగున్నట్లుంది అనుకుంటున్నారా? నిజానికి చీర్‌లీడర్‌గా ఎంపిక కావడం అంత తేలికేం కాదు. స్వతహాగా మంచి డాన్సర్లు అయిన వాళ్లు, మోడలింగ్‌ రంగంలో ఉన్నవాళ్లను.. అనేక ఇంటర్వ్యూల అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు సెలక్ట్‌ చేస్తాయి.

అంతేకాదు వేలాది ప్రేక్షకుల నడుమ రాత్రిపగలు మ్యాచ్‌లనే తేడా లేకుండా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది మరి! ప్రస్తుతం చీర్‌లీడర్స్‌గా ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో రెండేసి విజయాలతో డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 

చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌! ప్రతీసారి ఇంతే 
IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది'

మరిన్ని వార్తలు