Kane Williamson: కేన్‌ మామ కథ ముగిసే.. గాయంతో ఐపీఎల్‌ మొత్తానికి దూరం

2 Apr, 2023 16:44 IST|Sakshi
Photo: IPL Twitter

న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్స్‌న్‌ ఐపీఎల్‌ 2023 టోర్నీ నుంచి వైదొలిగాడు.  మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడంతో గుజరాత్‌ టైటాన్స్‌కు ఇది పెద్ద షాక్‌ అని చెప్పొచ్చు.  ఈ విషయాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ ఆదివారం తన ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించింది. 

‘‘సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆడుతూ గాయపడిన కేన్ విలియమ్సన్.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌కి వెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 జరగనుండటంతో అప్పటిలోపు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.'' అంటూ పేర్కొంది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో గత శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయమవగా.. ఫిజియో, సపోర్ట్ ప్లేయర్ సహాయంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను బ్యాటింగ్‌కి రాలేదు.

దాంతో అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌‌‌ని ఆడించిన గుజరాత్ టైటాన్స్ ఫలితం అందుకుంది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుండగా.. కేన్ విలియమ్సన్ స్థానంలో ఏ ప్లేయర్‌ని ఇంకా గుజరాత్ టైటాన్స్ తీసుకోలేదు.

చదవండి: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్‌.. లక్నో తరపున తొలి బౌలర్‌గా

మరిన్ని వార్తలు