ముంబై ఇండియన్స్‌ ‘అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల’కు భలే ఛాన్స్‌.. ఇంగ్లండ్‌కు పయనం!

29 Jun, 2022 12:14 IST|Sakshi
డెవాల్డ్‌ బ్రెవిస్‌తో తిలక్‌వర్మ (PC: IPL/BCCI)

IPL 2022- Mumbai Indians: ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాళ్లకు ఆటను మెరుగుపరచుకునే మంచి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వారు మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. కాగా ఐపీఎల్‌-2022లో ముంబై దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోహిత్‌ శర్మ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్‌ వర్మ, డెవాల్డ్‌ బ్రెవిస్‌ తదితరులు రాణించడం కాస్త ఊరటనిచ్చిన అంశం.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్‌ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాప్‌ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం.

వాళ్లందరికీ అవకాశం
ఈ విషయాల గురించి ముంబై వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ వర్మ, కుమార్‌ కార్తికేయ, రమణ్‌దీప్‌ సింగ్‌, హృతిక్‌ షోకీన్‌ తదితర యువ క్రికెటర్లకు టాప్‌ టీ20 క్లబ్‌లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది.

ఇప్పటికే అర్జున్‌ టెండుల్కర్‌ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ సైతం వీరితో చేరునున్నాడు’’ అని పేర్కొన్నాయి. ఇక భారత్‌కు చెందిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్‌ టూర్‌ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. కాగా తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఐపీఎల్‌-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ ట్రిప్‌లో భాగమైన ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్ల జాబితా(అంచనా)
ఎన్టీ తిలక్‌ వర్మ, కుమార్‌ కార్తికేయ, హృతిక్‌ షోకేన్‌, మయాంక్‌ మార్కండే, రాహుల్‌ బుద్ధి, రమణ్‌దీప్‌ సింగ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, బాసిల్‌ థంపి, మురుగన్‌ అశ్విన్‌, ఆర్యన్‌ జుయాల్‌, ఆకాశ్‌ మెధ్వాల్‌, అర్షద్‌ ఖాన్‌, అర్జున్‌ టెండుల్కర్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌.
చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్‌ చేతికి బంతి.. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లదే!

మరిన్ని వార్తలు