-

IPL 2023 Mini Auction: ఐపీఎల్‌ సాలరీల కోసం ఆర్సీబీ ఖర్చు ఎన్ని వందల కోట్లంటే!? దారుణంగా ట్రోల్‌ చేసిన హర్షల్‌ గిబ్స్‌

18 Nov, 2022 18:53 IST|Sakshi
ఆర్సీబీ (PC: IPL/BCCI)

Harshall Gibbs Trolls RCB- Still No Trophy Check Details: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే కాసుల వర్షం.. ఎంతో మంది యువ ఆటగాళ్లను లక్షాధికారులుగా మార్చివేసిందీ క్యాష్‌ రిచ్‌ లీగ్‌. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి..‌ వేలంలో అమ్ముడుపోతే చాలు మినిమమ్‌ లక్షాధికారి అయిపోవచ్చు అనే గ్యారెంటీ కలిగించింది. 

ఇక అదృష్టం కలిసి వచ్చి.. తుది జట్టులో చోటు దక్కి ఆడే అవకాశం రావడం.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే కోట్లు కొల్లగొట్టవచ్చు. మెరికల్లాంటి ఆటగాళ్లు దొరికితే జట్లు ట్రోఫీలు గెలవచ్చు. కాగా 2008 నుంచి 2022 వరకు పదిహేను ఐపీఎల్‌ సీజన్లు జరిగాయి. 

ఐపీఎల్‌-2023 కోసం సన్నద్ధమయ్యే క్రమంలో డిసెంబరు 23 నాటి మినీ వేలానికి సిద్ధమవుతున్నాయి. రేసు గుర్రాల్లాంటి క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్‌ సాలరీల కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసిన ఫ్రాంఛైజీ ఏదో తెలుసా?

ఆర్సీబీ.. అవును.. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు అక్షరాలా తొమ్మిది వందల పది కోట్లు ఖర్చు చేసినట్లు మనీబాల్‌ నివేదించింది. ఆ తర్వాతి స్థానం ముంబై ఇండియన్స్‌దేనట! మరి మిగతా జట్ల వివరాలు తెలుసుకుందామా!

ఇప్పటి వరకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఖర్చు చేసిన మొత్తం- గెలిచిన టైటిళ్లు
►రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 910.5 కోట్ల రూపాయలు- 0
►ముంబై ఇండియన్స్‌- 884.5 కోట్ల రూపాయలు- 5
►కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 852.5 కోట్ల రూపాయలు- 2
►ఢిల్లీ క్యాపిటల్స్‌- 826.6 కోట్ల రూపాయలు- 0
►పంజాబ్‌ కింగ్స్‌- 778.3 కోట్ల రూపాయలు- 0
►చెన్నై సూపర్‌ కింగ్స్‌- 761.1 కోట్ల రూపాయలు- 4
►సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 646.9 కోట్ల రూపాయలు- 1
►రాజస్తాన్‌ రాయల్స్‌- 613.3 కోట్ల రూపాయలు- 1

2022లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లు
►లక్నో సూపర్‌ జెయింట్స్‌- 89.2 కోట్ల రూపాయలు- 0
►గుజరాత్‌ టైటాన్స్‌- 88.3 కోట్ల రూపాయలు- 1

అత్యధిక మొత్తం.. అయినా ఒక్క ట్రోఫీ లేదు
ఈ వివరాలను తెలియజేస్తూ క్రిక్‌ట్రాకర్‌.. ‘‘ఇప్పటి వరకు ఐపీఎల్‌ సాలరీల కోసం అ‍త్యధిక మొత్తం ఖర్చు చేసిన ఫ్రాంఛైజీ ఆర్సీబీ’’ అని ట్వీట్‌ చేసింది. ఇక ఇందుకు స్పందించిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ హర్షల్‌ గిబ్స్‌.. ‘‘ఇంతవరకు ఒక్కటి కూడా’’ అంటూ ఆర్సీబీని ట్రోల్‌ దారుణంగా ట్రోల్‌ చేశాడు. 

ఇక ఇందుకు బదులుగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. స్టార్‌ ప్లేయర్లున్నా ఆర్సీబీ టైటిల్‌ గెలవలేకపోవడం వెనుక ఏదో అదృశ్య శక్తి హస్తం ఉందని.. సౌతాఫ్రికా లాగే ఆర్సీబీ కూడా చోకర్స్‌ అనిపించుకుంటోందని గిబ్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు.

మరికొంత మంది ఐపీఎల్‌లో హర్షల్‌ గిబ్స్‌ను ఆటను గుర్తు చేసుకుంటూ నిన్ను మిస్సవుతున్నాం అంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా దక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌కు గిబ్స్‌ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 

చదవండి: IND Vs NZ: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'
Rishabh Pant: రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్‌లో పంత్‌దే హవా.. జట్టులో కీలక ప్లేయర్‌గా..
 

మరిన్ని వార్తలు