IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..!

22 Dec, 2022 21:39 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్‌ మినీ వేలం రేపు (డిసెంబర్‌ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలానికి ముందు అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడానికి జియో సినిమాస్ మాక్‌ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. 

ఇందులో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కెమారూన్‌ గ్రీన్‌ అత్యధికంగా 20 కోట్లకు అమ్ముడుపోయాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గ్రీన్‌ కోసం చివరి దాకా ప్రయత్నించి సొంతం చేసుకుంది. 

ఈ మాక్‌ వేలంలో రెండో అత్యధిక ధర ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్‌-2022 ఫైనల్‌ హీరో సామ్ కర్రన్‌కు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్‌ కర్రన్‌ను 19.5 కోట్లకు సొంతం చేసుకుంది. 

ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. అనూహ్యంగా గ్రీన్‌, కర్రన్‌ల కంటే తక్కువ ధర పలికాడు. స్టోక్స్‌ను పంజాబ్ కింగ్స్ 19 కోట్లకు కొనుగోలు చేసింది. 

వీరి తర్వాత విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఓడియన్ స్మిత్‌కు 8.5 కోట్లు (ముంబై ఇండియన్స్), విండీస్‌ వికెట్ కీపర్ కమ్‌ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు 8.5 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)  భారీ ధరలు పలికారు. కాగా, ఈ మాక్‌ వేలం కేవలం ప్రేక్షకుల ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమేనని నిర్వాహకులు తెలిపారు.

ఇదిలా ఉంటే, రేపు జరుగబోయే వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్‌ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్‌ పోటీ పడతారు. 

షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్‌లో బ్యాటర్లు, రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్‌లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్‌లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్‌లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్‌ల వారీగా జరుగనుంది. 

మరిన్ని వార్తలు