IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్‌

7 Mar, 2023 12:33 IST|Sakshi

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఐపీఎల్‌ 2023 సీజన్‌ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జట్టుకు చెందిన మరో ఫాస్ట్‌ బౌలర్‌, ఆసీస్‌ ఆటగాడు జై రిచర్డ్‌సన్‌ కూడా గాయం కారణంగా ఐపీఎల్‌-2023 మొత్తానికి దూరంగా ఉంటాడన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్ల స్థానాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమైంది ఎంఐ యాజమాన్యం. ఇందుకోసం 2023 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాను జల్లెడపట్టడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో ఎంఐ యజమాన్యానికి అన్‌సోల్డ్‌ జాబితాలో మిగిలిపోయిన ఓ తురుపుముక్క తారసపడింది. అతని పేరు సందీప్‌ శర్మ. ఐపీఎల్‌ పవర్‌ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు కలిగిన సందీప్‌ శర్మను 2023 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముం‍బై ఇండియన్స్‌ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన సందీప్‌ శర్మను తమ జట్టులోని తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది.

2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌ కీలక బౌలర్‌గా చలామణి అయిన సందీప్‌ను 2022 వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడంతో పంజాబ్‌ కింగ్స్‌ కూడా గడిచిన సీజన్‌ తర్వాత అతన్ని వేలానికి వదిలేసింది. ఐపీఎల్‌లో రికార్డు స్థాయిలో 114 వికెట్లు పడగొట్టిన సందీప్‌ను 2023 వేలంలో  ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.

2013లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున  ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన సందీప్‌.. తన తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌పై కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నాటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోని సందీప్‌.. 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నాటి స్టార్‌ క్రికెటర్లు క్రిస్‌ గేల్‌, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ భరతం పట్టాడు. ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లను ఓ మ్యాచ్‌లో ఒకే బౌలర్‌ ఔట్‌ చేయడం అదే తొలిసారి.

ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. సందీప్‌ శర్మ, ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లిని ఏకంగా 7 సార్లు ఔట్‌ చేశాడు. ఐపీఎల్‌లో ఏ బౌలర్‌ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్‌ చేయలేదు. నెహ్రా 6, బుమ్రా 4 సార్లు కోహ్లిని పెవిలియన్‌కు పంపారు. ఐపీఎల్‌లో సందీప్‌ బౌలింగ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. కేవలం 55 పరుగులు మాత్రమే చేసి ఏడు సార్లు ఔటయ్యాడు. ఐపీఎల్‌లో ఓ బౌలర్‌కు వ్యతిరేకంగా కోహ్లికి ఇవి చెత్త గణాంకాలుగా రికార్డయ్యాయి. 

మరిన్ని వార్తలు