#Rohit Sharma: వాళ్లిద్దరు అద్భుతం.. తన బ్యాటింగ్‌ పవర్‌ ఎలాంటిదో మరోసారి చూశాం.. కానీ: రోహిత్‌

4 May, 2023 09:48 IST|Sakshi
రోహిత్‌ శర్మ (PC: IPL/BCCI)

IPL 2023 PBKS Vs MI: ముంబై ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లపై ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని కొనియాడాడు. ఇక జట్టుగా ఫలితాల గురించి ఆలోచిస్తూ ఒత్తిడిలో కూరుకుపోయే అలవాటు తమకు లేదని.. తమ వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నాడు.

ఆ ఇద్దరు భారం మోశారు
ఐపీఎల్‌-2023లో భాగంగా మొహాలీలో పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే రోహిత్‌ శర్మ (0) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.

ఏడు బంతులు మిగిలి ఉండగానే
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కిషన్‌ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు, సూర్య 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. తిలక్‌ వర్మ కూడా వీరికి తోడయ్యాడు. ఈ క్రమంలో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించి వరుసగా రెండోసారి భారీ టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన తొలి జట్టుగా నిలిచింది.

అప్పుడు విన్నింగ్‌ స్కోరు 150!
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్‌ ఆడటం మొదలు పెట్టిన తొలినాళ్లలో 150 విన్నింగ్‌​ స్కోరు. మిలిగిన వాళ్లకు తోడు కనీసం ఒక్క అదనపు బ్యాటర్‌ అయినా మెరుగ్గా రాణిస్తే ఫలితం తారుమారయ్యే పరిస్థితి.

అయితే, ఈ సీజన్‌లో సగటు ఛేజింగ్‌ స్కోరు 180గా ఉంది. స్కై కీలక సమయంలో బ్యాట్‌ ఝులిపించాడు. ఇక కిషన్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. సీజన్‌ ఆరంభంలోనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఫలితం ఎలా ఉన్న మన శక్తిమేర విజయం కోసం పోరాడుతూనే ఉండాలని భావించాం.

బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు
అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. యువ ఆటగాడైన కిషన్‌ బ్యాటింగ్‌ పవర్‌ ఎలాంటిదో.. తను ఎలాంటి షాట్లు ఆడగలడో  మరోసారి చూశాం. కిషన్‌ కఠినంగా శ్రమిస్తాడు. నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తూనే ఉంటాడు.

మైదానంలో ఆ మేరకు ఇలా ఫలితాలు సాధిస్తాడు’’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. అయితే, తమ బౌలింగ్‌ విభాగం మెరుగుపడాల్సి ఉందని, ప్రత్యర్థి జట్టును 200 మేర స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేయాల్సి ఉందని పేర్కొన్నాడు.

చదవండి: Indian Wrestlers' Protest: విమర్శలపాలై.. ఆలస్యంగానైనా వచ్చిన ఉష! కానీ చేదు అనుభవం!?
Virat Kohli: ఐపీఎల్‌ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు!

మరిన్ని వార్తలు