IPL 2023: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌..?

3 Dec, 2022 19:35 IST|Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌. ప్రస్తుతం సీఎస్‌కే క్యాంప్‌లో జరుగుతున్న అతిపెద్ద చర్చ ఇది. 2023 సీజన్‌లో జట్టు కెప్టెన్సీ భారాన్ని మోయమని అతికష్టం మీద ధోనిని ఒప్పించిన సీఎస్‌కే యాజమాన్యం, నెక్స్ట్‌ ఏంటీ అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. ధోని ఉండగానే భవిష్యత్‌ కెప్టెన్‌ను తయారు చేసుకోవాలని భావించిన యాజమాన్యం.. గత సీజన్‌లో జడేజాకు కెప్టెన్సీ అప్పగించి చేతులు కాల్చుకుంది. దీంతో ఈసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో వారికి రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో భవిష్యత్‌ ఆశాకిరణం కనిపించాడు.

తాజాగా ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో రుతురాజ్‌ కెప్టెన్సీ స్కిల్స్‌ను, ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. ధోని తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీ పగ్గాలు అతనికే అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రుతురాజ్‌కు ధోని, జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ సైతం మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. హస్సీ అయితే ఏకంగా రుతురాజ్‌  పేరును నేరుగా యాజమాన్యం ముందుంచినట్లు తెలుస్తోంది. రుతురాజ్‌ను గత రెండు సీజన్లుగా క్షుణ్ణంగా గమనిస్తున్న హస్సీ.. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కళంగా ఉన్నాయని, అతనైతేనే ధోని వారసుడిగా అంచనాల మేరకు రాణిస్తాడని రెకమెండ్‌ చేసినట్లు సమాచారం. 

రుతురాజ్‌ అద్భుతమైన బ్యాటర్‌ అని, ఈ విషయం ఇదివరకే చాలాసార్లు ప్రూవైందని, అతను ఒత్తిడిలో ధోనిలా కూల్‌గా ఉంటాడని, పరిస్థితులను నిశితంగా పరిశీలించడంలో అతనో దిట్ట అని హస్సీ.. మేనేజ్‌మెంట్‌కు ఓ నివేదిక సైతం పంపినట్లు సీఎస్‌కే వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. హస్సీ నివేదికతో పాటు ధోని సపోర్ట్‌, ఇటీవలి కాలంలో రుతురాజ్‌ ఫామ్‌, మహారాష్ట్ర కెప్టెన్‌గా అతని సక్సెస్‌ను పరిగణలోకి తీసుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ 2024 సీజన్‌ నుంచి సీఎస్‌కే సారధ్య బాధ్యతలు రుతురాజ్‌కే అప్పజెప్పాలని డిసైడ్‌ అయినట్లు ప్రచారం జరుగుతుంది.

కాగా, తాజాగా ముగిసిన విజయ్‌ హజారే టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాదిన రుతురాజ్‌.. ఈ టోర్నీలో గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 8 సెంచరీలు బాది భీకరమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే.. 2020లో లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పుణే కుర్రాడు.. 2021 సీజన్‌లో సీఎస్‌కేను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ సీజన్‌లో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు.

మరిన్ని వార్తలు