Tripathi- Markram: అద్భుత ఇన్నింగ్స్‌.. త్రిపాఠి- మార్కరమ్‌ అరుదైన ఘనత.. రెండేళ్ల తర్వాత..

10 Apr, 2023 10:56 IST|Sakshi
త్రిపాఠి- మార్కరమ్‌ (PC: IPL)

Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్‌-2023లో ఆరెంజ్‌ ఆర్మీకి ఎట్టకేలకు ‘సన్‌రైజ్‌’ అయింది. హైదరాబాద్‌ జట్టు విన్‌రైజర్స్‌గా నిలిచి తాజా ఎడిషన్‌లో తొలి విజయం నమోదు చేసింది. సమిష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసి అభిమానులను ఖుషీ చేసింది.

ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ శుభారంభం అందించాడు. తొలి బంతికే పంజాబ్‌ ఓపెనర్‌ ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

చెలరేగిన మార్కండే
ఈ క్రమంలో మార్కో జాన్సెన్‌ రెండు వికెట్లు తీయగా.. దేశీ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగాడు. కశ్మీర్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ రెండు వికెట్లతో మెరిశాడు. రైజర్స్‌ బౌలర్ల విజృంభణతో పంజాబ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టినప్పటికీ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ (66 బంతుల్లో 99 పరుగులు)ఆడాడు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ధావన్‌ సేన 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్‌(14 బంతుల్లో 13 పరుగులు), మయాంక్‌ అగర్వాల్‌ (20 బంతుల్లో 21 పరుగులు) నిరాశపరిచారు.

త్రిపాఠి, మార్కరమ్‌ వల్లే ఇలా.. అరుదైన ఘనత
ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి(48 బంతుల్లో 74 పరుగులు నాటౌట్‌), కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ (21 బంతుల్లో 37 పరుగులు నాటౌట్‌)బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. వరుస బౌండరీలతో విరుచుకుపడిన త్రిపాఠి 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. నాథన్‌ ఎలిస్ ఓవర్లో మార్కరమ్‌ నాలుగు ఫోర్లు బాది రైజర్స్‌ విజయం ఖరారు చేశాడు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో సన్‌రైజర్స్‌ ఖాతాలో తొలి గెలుపు వచ్చి చేరింది.

ఈ నేపథ్యంలో త్రిపాఠి, మార్కరమ్‌ అరుదైన ఘనత అందుకున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున మూడో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఐదో జోడీగా నిలిచారు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం
►మనీశ్‌ పాండే- విజయ్‌ శంకర్‌ -2021- దుబాయ్‌లో- రాజస్తాన్‌ రాయల్స్‌ మీద- 140 పరుగులు
►కేన్‌ విలియమ్సన్‌- మనీశ్‌ పాండే- 2018- బెంగళూరలో- ఆర్సీబీతో మ్యాచ్‌లో- 135 పరుగులు
►డేవిడ్‌ వార్నర్‌- విజయ్‌ శంకర్‌-  2017- గుజరాత్‌ లయన్స్‌ మీద- కాన్పూర్‌లో- 133 పరుగులు
►కేఎల్‌ రాహుల్‌- డేవిడ్‌ వార్నర్‌- 2014లో- ముంబై ఇండియన్స్‌ మీద- దుబాయ్‌లో- 111 పరుగులు
►రాహుల్‌ త్రిపాఠి- ఎయిడెన్‌ మార్కరమ్‌- 2023లో- పంజాబ్‌ కింగ్స్‌ మీద- హైదరాబాద్‌లో- 100 పరుగులు

అదే విధంగా ఈ గెలుపుతో సొంతగడ్డపై హైదరాబాద్‌ జట్టు 31వ విజయం నమోదు చేసింది. ఇప్పటివరకు ఆడిన 46 మ్యాచ్‌లలో 31 గెలిచి.. 15 ఓడిపోయింది.
చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్‌
#KavyaMaran: 'చల్‌ హట్‌ రే'.. నీకు నేనే దొరికానా! 

మరిన్ని వార్తలు