Steve Smith: ఐపీఎల్‌-2023.. నేను చేరబోయే టీమ్‌ అదే: స్టీవ్‌ స్మిత్‌

29 Mar, 2023 14:24 IST|Sakshi
స్టీవ్‌ స్మిత్‌ (ఫైల్‌ ఫొటో)

IPL 2023- Steve Smith: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తాను పునరాగమనం చేయనున్నట్లు ప్రకటించిన ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు తాను భాగస్వామ్యమయ్యే జట్టు గురించి వెల్లడించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ టీమ్‌తో జతకట్టనున్నానని.. కామెంటేటర్‌గా అవతారం ఎత్తనున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్‌-2023 అధికారిక ప్రసారకర్త స్టార్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌లో భాగం కానున్నట్లు తెలిపాడు. 

ఈ మేరకు.. ‘‘నాకు తెలిసినంత వరకు నేను ఆటను చాలా బాగా అర్థం చేసుకోగలను. అంతే బాగా విశ్లేషించగలను కూడా! స్టార్‌ స్పోర్ట్స్‌ టీమ్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. నాకిది సరికొత్త అనుభవం’’ అని స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు.

కాగా గతంలో రాజస్తాన్‌ రాయల్స్‌,  ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని  పుణె వారియర్స్‌ ఇండియా, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌, కొచ్చి టస్కర్స్‌ కేరళ జట్ల తరఫున స్మిత్‌ ఐపీఎల్‌ ఆడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గతేడాది వేలంలోకి రాగా ఏ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయలేదు. దీంతో కామెంటేటర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ స్టార్‌ బ్యాటర్‌ సిద్ధమయ్యాడు. ఇక ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శనకు స్మిత్‌ కెప్టెన్సీ వ్యూహాలే కారణం. అదే విధంగా ఆసీస్‌ వన్డే సిరీస్‌ను గెలవడంలోనూ సారథిగా అతడి అనుభవం అక్కరకు వచ్చింది.

కాగా స్మిత్‌ ప్రస్తుతం ఆసీస్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండగా.. భారత పర్యటనలో ఆఖరి రెండు టెస్టులు, వన్డే సిరీస్‌కు ప్యాట్‌ కమిన్స్‌ దూరం కాగా.. అతడు జట్టును ముందుండి నడిపించాడు.  ఇదిలా ఉంటే.. మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ పదహారవ సీజన్‌కు తెరలేవనుంది.

చదవం‍డి: PAK Vs AFG: చారిత్రాత్మక విజయం.. ఆఫ్గన్‌ సుందరి మళ్లీ వచ్చేసింది
IPL 2023: రిషబ్‌ పంత్‌ స్థానంలో బెంగాల్‌ సంచలనం!

>
మరిన్ని వార్తలు