-

ఐపీఎల్‌పై మనసు పారేసుకున్న పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌

27 Nov, 2023 14:52 IST|Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌ వేలానికి ముందు పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ హసన్‌ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి క్రికెటర్‌ కోరుకునే విధంగానే తనకు కూడా ఐపీఎల్‌ ఆడాలని ఉందని అన్నాడు. ఐపీఎల్‌ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్‌లలో ఒకటని.. ఇలాంటి లీగ్‌లో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడని తెలిపాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే తాను తప్పక క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఓ లోకల్‌ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ హసన్‌ అలీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

కాగా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాకిస్తాన్‌ క్రికెటర్లు కేవలం ఒకే ఒక్క ఎడిషన్‌లో ఆడిన విషయం తెలిసిందే. లీగ్‌ ప్రారంభమైన తొలి ఏడాది (2008) మాత్రమే పాక్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొన్నారు. అనంతరం భారత్‌-పాక్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో దాయాది దేశ క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కలేదు. 

2008 ఎడిషన్‌లో షాహిద్‌ అఫ్రిది (డెక్కన్‌ ఛార్జర్స్‌), షోయబ్‌ మాలిక్‌, మొహమ్మద్‌ ఆసిఫ్‌ (ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌), కమ్రాన్‌ అక్మల్‌, సోహైల్‌ తన్వీర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), మిస్బా ఉల్‌ హాక్‌ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు), షోయబ్‌ అక్తర్‌, సల్మాన్‌ బట్‌, ఉమర్‌  గుల్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), అజహార్‌ మెహమూద్‌ (పంజాబ్‌ కింగ్స్‌) ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు.

మరిన్ని వార్తలు