తక్కువ అంచనా వేయకూడదు: హార్దిక్‌ పాండ్యా

18 Feb, 2021 13:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. 2008లో ప్రారంభమైన ఈ క్యాష్‌ రిచ్‌లీగ్‌ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ప్రతిభను నిరూపించుకున్న ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించడంతో, యువ క్రికెటర్లు ఎంతో మంది ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగారు. అలాంటి వాళ్లలో హార్దిక్‌ పాండ్యా కూడా ఒకడు. గుజరాత్‌లో 1993లో జన్మించిన పాండ్యా..  2013లో తొలిసారిగా బరోడా క్రికెట్‌ టీంకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(2013-14)లో బరోడా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి అందరి దృష్టి ఆకర్షించాడు.

ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన పాండ్యాపై ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ ఆసక్తి కనబరిచింది. 2015లో అతడిని కొనుగోలు చేసింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన పాండ్యా.. ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో 2015 నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా.. నేడు మినీ వేలం సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. 

‘‘కలలకు ఉన్న శక్తి గురించి తక్కువగా అంచనా వేయకూడదు. నేను ఎక్కడి నుంచి ఎక్కడిదాకా వచ్చాను అన్న విషయాన్ని ఐపీఎల్‌ వేలం ఎల్లప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు’’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను తొలినాళ్లలో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత ఐపీఎల్‌ అతడి జీవితాన్ని ఎలా మార్చింది అన్న విషయాల గురించి ఇందులో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక పాండ్యా సోదరుడు కృనాల్‌ పాండ్యా కూడా క్రికెటర్‌ అన్న సంగతి తెలిసిందే. అతడు కూడా ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు.
చదవండి: 10 కోట్లకు కొంటే ఆడలేదు.. ఇప్పుడేమో ఫేవరెట్‌!
చదవండి: అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే!

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

మరిన్ని వార్తలు