టీమిండియాను వణికించిన లిటన్‌ దాస్‌పై ప్రముఖ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కన్ను..? 

3 Nov, 2022 15:50 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నిన్న (నవంబర్‌ 2) బంగ్లాదేశ్‌తో జరిగిన రసవత్తర సమరంలో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో అంతిమంగా టీమిండియానే విజయం సాధించినప్పటికీ.. బంగ్లాదేశ్‌ కనబర్చిన అద్భుతమైన పోరాటపటిమ విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఛేదనలో మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియాను గడగడలాడించిన లిటన్‌ దాస్‌ ప్రత్యేకంగా అందరి మన్ననలు అందుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న దాస్‌.. టీమిండియాను వణింకించి, బంగ్లాకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే ఈ దశలో వరుణుడు పలకరించడంతో పరిస్థితి అంతా ఒక్కసారిగా తల్లకిందులైంది. ఉగ్రరూపంతో టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన దాస్‌.. తడిసిన పిచ్‌పై కాలు జారీ రనౌట్‌ కావడంతో పరిస్థితి తారుమారైంది. అప్పటి దాకా గెలుపుపై ధీమాగా ఉన్న బంగ్లా జట్టు.. దాస్‌ ఔటైన షాక్‌లో లయ తప్పి వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీతో భారత్‌ను గడగడలాడించిన లిటన్‌ దాస్‌పై ప్రముఖ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌).. దాస్‌ను దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. లిటన్‌ కుమెర్‌ దాస్‌ స్వతహాగా బెంగాలీ కావడంతో.. తమ జట్టులో ఉంటే బాగుంటుందని ఫ్రాంచైజీకి చెందిన కీలక వ్యక్తి భారత్‌-బంగ్లా మ్యాచ్‌ అనంతరం మీడియాతో షేర్‌ చేసుకున్నట్లు సమాచారం.

కాగా, 28 ఏళ్ల దాస్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రైట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ కమ్‌ టెస్ట్‌ వికెట్‌కీపర్‌ అయిన దాస్‌.. బంగ్లాదేశ్‌ తరఫున 35 టెస్ట్‌ మ్యాచ్‌లు, 57 వన్డేలు, 62 టీ20లు ఆడి ఐదు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 29 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు (176) దాస్‌ పేరిటే నమోదై ఉంది.  

>
Poll
Loading...
మరిన్ని వార్తలు