IPL 2022- CSK: వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండబోడు.. 16 కోట్లు మిగులుతాయి.. కానీ!

24 May, 2022 18:11 IST|Sakshi
సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా(PC: IPL)

IPL 2022- Ravindra Jadeja : ఐపీఎల్‌-2022 సీజన్‌ టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజాకు చేదు అనుభవాన్ మిగిల్చింది. గత సీజన్‌లో జడ్డూ 12 ఇన్నింగ్స్‌లో కలిపి 227 పరుగులు చేయడం(అత్యధిక స్కోరు 62 నాటౌట్‌) సహా 16 ఇన్నింగ్స్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి చెన్నైని చాంపియన్‌గా నిలపడంలో తన వంతు సాయం అందించాడు. 

ఈ ఎంఎస్‌ ధోని వారసుడిగా చెన్నై జట్టు పగ్గాలు చేపట్టనున్నాడనన్న అంచనాల నేపథ్యంలో మెగా వేలం-2022కు ముందు 16 కోట్లు వెచ్చించి సీఎస్‌కే అతడిని రిటైన్‌ చేసుకుంది. తాజా ఎడిషన్‌ ఆరంభానికి ముందు తమ కెప్టెన్‌గా ప్రకటించింది.

కానీ, ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేయగల జడేజా సారథిగానే కాకుండా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. కెప్టెన్సీ భారం మోయలేక చతికిలపడ్డాడు. 116 పరుగులు చేసి, 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడి కెప్టెన్సీలో సీఎస్‌కే కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. దీంతో జడ్డూ తీవ్ర విమర్శల పాలయ్యాడు.

ఈ క్రమంలో ధోని మళ్లీ చెన్నై సారథ్య బాధ్యతలు స్వీకరించగా.. జడ్డూ ఆఖరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో ఫ్రాంఛైజీకి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, చెన్నై యాజమాన్యం వీటిని కొట్టిపారేసినా.. ఏదో తేడా జరిగిందనే అభిమానుల సందేహం మాత్రం అలాగే ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రవీంద్ర జడేజా విషయంలో ఎన్నెన్నో ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఆఖరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో లేడు. అంతకుముందే కెప్టెన్సీ వదిలేశాడు.

చెన్నై అతడిని 16 కోట్ల రూపాయలకు రిటైన్‌ చేసుకుంది. అయితే, ఇటీవలి పరిణామాలు చూస్తుంటే వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండబోడని స్పష్టంగా తెలుస్తోంది. ఎంఎస్‌ ధోని సైతం.. కెప్టెన్సీ జడ్డూ ఆటపై తీవ్ర ప్రభావం చూపిందని స్పష్టం చేశాడు. అయితే, తమ జట్టులో అంతాబాగానే ఉందని సీఎస్‌కే వర్గాలు అంటున్నాయి. కానీ ఆఖరి వరకు ఏమి జరుగుతుందో చెప్పలేము.

ఒకవేళ సీఎస్‌కే జడేజాను రిలీజ్‌ చేస్తే వారికి 16 కోట్లు మిగులుతాయేమో కానీ.. అలాంటి ఆటగాడు మాత్రం వారికి ఎప్పటికీ దొరకడు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా వెటరన్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో గురించి ప్రస్తావిస్తూ.. ‘‘డ్వేన్‌ బ్రావోను సీఎస్‌కు ఇంకెన్నాళ్లు కొనసాగిస్తుంది? బౌలర్‌గా తను మరో సీజన్‌లోనూ రాణించగలడేమో.. కానీ అతడి కోసం 4.4 కోట్లు ఖర్చు చేశారు.

అతడు రోజురోజుకూ యువకుడు కావడం లేదన్న విషయాన్ని ఫ్రాంఛైజీ గమనించాలి. అతడి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన చెన్నై ఐపీఎల్‌-2022లో ఘోర వైఫల్యంలో కేవలం 8 పాయింట్లు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

చదవండి👉🏾'అతడు అద్భుతమైన ఆటగాడు.. తిరిగి జట్టులోకి వ‌స్తాడ‌ని ఎవ‌రు ఊహించి ఉండ‌రు'
చదవండి👉🏾Shubman Gill: గిల్‌ గురించి మీరు మాట్లాడేది తప్పు: జర్నలిస్టుకు విక్రమ్‌ కౌంటర్‌

మరిన్ని వార్తలు