IPL 2022 CSK Vs PBKS: చెన్నైపై ఆల్‌రౌండ్‌ పంజా

4 Apr, 2022 05:48 IST|Sakshi

54 పరుగులతో పంజాబ్‌ విజయం

చెలరేగిన లివింగ్‌స్టోన్‌

కూల్చేసిన వైభవ్, చహర్‌

ముంబై: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 54 పరుగులతో ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్యాట్‌తో బాల్‌తో లివింగ్‌స్టోన్‌ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు; 2 వికెట్లు) చెలరేగాడు. తర్వాత చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఈ లీగ్‌లో వరుసగా మూడో ఓటమి చవిచూసింది. శివమ్‌ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. రాహుల్‌ చహర్‌ 3 వికెట్లు పడగొట్టాడు.  

లివింగ్‌స్టోన్‌ సిక్సర్లతో...
ఇన్నింగ్స్‌ రెండో బంతికే పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ (4) వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్లో భానుక రాజపక్స (9) రనౌటయ్యాడు. కింగ్స్‌ స్కోరు 14/2. ఇలాంటి దుస్థితిలో ఉన్న పంజాబ్‌ను లివింగ్‌స్టోన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ మార్చేసింది. ముఖ్యంగా ముకేశ్‌ చౌదరి బౌలింగ్‌ను చితగ్గొట్టాడు. ముకేశ్‌ ఐదో ఓవర్లో 6, 0, 4, వైడ్, వైడ్, 4, 4, 6లతో 26 పరుగుల్ని పిండుకున్నాడు. ఓవర్‌కు పది పైచిలుకు రన్‌రేట్‌తో పంజాబ్‌ 9.1 ఓవర్లోనే 100 పరుగులు దాటేసింది. 11వ ఓవర్లో లివింగ్‌స్టోన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ను జడేజా ముగించడంతో పంజాబ్‌ జోరు తగ్గింది. జితేశ్‌ (17 బంతుల్లో 26; 3 సిక్సర్లు) విరుచుకుపడినా... షారుక్‌ (6), స్మిత్‌ (3) నిరాశపరిచారు.

చెన్నై చతికిల...
పంజాబ్‌ పేస్‌కు చెన్నై బ్యాటర్స్‌ చతికిలబడ్డారు. టాపార్డర్‌ సహా ఐదో వరుస బ్యాట్స్‌మన్‌ వరకు ఎవరూ నిలువలేకపోయారు. సీమర్లు వైభవ్‌ అరోరా (2/), రబడ (1/28), స్మిత్‌ (1/14), అర్శ్‌దీప్‌ (1/13) పవర్‌ ప్లేలోనే చెన్నైకి చెక్‌ పెట్టారు. ఇంకా 14 ఓవర్లు ఉన్నా కూడా ఏంచేయలేని స్థితిలోకి పడేశారు. శివమ్‌ దూబే మెరుపులు కాసేపు ప్రేక్షకుల్ని అలరించాయే తప్ప జట్టును కష్టాల ఊబి నుంచి గట్టెక్కించలేకపోయాయి. ఉతప్ప (13), రుతురాజ్‌ (1), మొయిన్‌ అలీ (0), రాయుడు (13), జడేజా (0) నిప్పులు చెరిగే బౌలింగ్‌ ముందు మోకరిల్లారు. ధోని (23), దూబే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు.

ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు