ఇదే సరైన సమయం...

14 Nov, 2020 05:14 IST|Sakshi

ఐపీఎల్‌లో కొత్త జట్ల ప్రతిపాదనపై ద్రవిడ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మరింత విస్తరించేందుకు ఇది సరైన సమయమని భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. లీగ్‌ నాణ్యతలో రాజీ పడకుండా జట్ల సంఖ్యను పెంచినట్లయితే యువ క్రికెటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ పరంగా గత దశాబ్ధం భారత్‌కు అత్యుత్తమమని పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు టి20 ప్రపంచకప్‌లోనూ గొప్ప ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నాడు.

రాజస్తాన్‌ రాయల్స్‌ సహ యజమాని మనోజ్‌ బదాలే రాసిన పుస్తకం ‘ఎ న్యూ ఇన్నింగ్స్‌’ వర్చువల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్‌ ఈ అంశంపై మాట్లాడాడు. ‘ప్రతిభపరంగా చూస్తే ఐపీఎల్‌ను విస్తరించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నా. సత్తా ఉన్న ఎందరో క్రికెటర్లకు ఈ వేదికపై ఇంకా ఆడే అవకాశం దక్కడం లేదు. ఐపీఎల్‌లో జట్ల సంఖ్య పెంచితే వీరందరికీ అవకాశం లభిస్తుంది. ప్రతిభ చాటేందుకు చాలామంది యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే లీగ్‌ నాణ్యతలో ఏమాత్రం తేడా రాకుండా ఈ విస్తరణ చేపట్టాలి. తొలుత రంజీలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర సంఘాలపై ఆధారపడాల్సి వచ్చేది. క్రికెటర్లకు పరిమిత అవకాశాలుండేవి. ఇప్పడు ఐపీఎల్‌తో పరిస్థితి మారిపోయింది.

కోచ్‌లుగా మేం కొంత మాత్రమే సహకరించగలం. కానీ అనుభవం ద్వారానే యువ ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. లీగ్‌లో యువ దేవదత్‌... సీనియర్లు విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి బ్యాటింగ్‌ చేశాడు. ఈ అనుభవం జాతీయ జట్టుకు ఆడటానికి ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో రాణించడం వల్లే నటరాజన్‌ టీమిండియాకు ఎంపికయ్యాడు’ అని ద్రవిడ్‌ వివరించాడు. ద్రవిడ్‌ అభిప్రాయాన్ని మనోజ్‌ స్వాగతించాడు. వచ్చే ఏడాది 9 జట్లతో కూడిన ఐపీఎల్‌ నిర్వహణ కచ్చితంగా సాధ్యమేనని వ్యాఖ్యానించాడు. ఈ దిశగా బీసీసీఐ ఆలోచించాలని సూచించాడు. రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన ముంబై ఇండియన్స్‌ను ద్రవిడ్‌ అభినందించాడు. ప్రపంచ స్థాయి టి20 క్రికెటర్లతో పాటు యువకులతో కూడిన ముంబై అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు.  

మరిన్ని వార్తలు