Sheldon Jackson: అంతా గంభీర్‌ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని

16 Sep, 2021 15:57 IST|Sakshi
కేకేఆర్‌ ఆటగాడు షెల్డన్‌ జాక్సన్‌(Photo: IPL/BCCI)

Sheldon Jackson Gets Emotional About His Journey‘‘పాతికేళ్ల వయస్సులో క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా. అప్పటికి రంజీ ట్రోఫీ స్వ్యాడ్‌లో ఉన్న నేను ఐదేళ్లుగా బెంచ్‌కే పరిమితమయ్యాను. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. అప్పుడు నా స్నేహితుడు మిస్టర్‌ షపత్‌ షా ఓ మాట చెప్పాడు. ‘‘ఇన్నేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నావు. ఎంతో కష్టపడ్డావు. మరొక్క ఏడాది ఆగు. నీకు మంచి రోజులు వస్తాయి. అలా జరగకపోతే.. నా ఫ్యాక్టరీలో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. అయితే, నువ్వు మాత్రం ఇప్పుడే ఆటను వదిలేయొద్దు సరేనా’’ అని నచ్చజెప్పాడు. 

తన మాటకు తలొంచాను. ఆ మరుసటి ఏడాది దేశంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్‌ చేశాను. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాను. దేశవాళీ లీగ్‌లు అన్నీ ఆడాను. ఒక్క ఏడాదిలో నాలుగు సెంచరీలు చేశాను. అందులో మూడు వరుస శతకాలు.. అప్పటి నుంచి ఆ కెరీర్‌ ఊపందుకుంది’’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు షెల్డన్‌ జాక్సన్‌ తన క్రికెట్‌ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు. స్నేహితుడి మాటలు తన జీవన గమనాన్నే మార్చివేశాయని ఉద్వేగానికి లోనయ్యాడు. 

దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర  తరఫున ఆడుతున్న షెల్డన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో క్రికెట్‌ను వదిలేద్దామనుకున్న అతడు.. అలా గనుక చేసి ఉంటే... ఇప్పుడు రోడ్డుమీద పానీపూరీ అమ్ముకునే వాడినని భావోద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్‌ రెండో అంచె ఆరంభం కానున్న నేపథ్యంలో షెల్డన్‌ జాక్సన్‌ కేకేఆర్‌తో సంభాషించాడు. 

రోడ్ల మీద పానీపూరీ అమ్ముకునేవాడిని!
‘‘ముందు చెప్పినట్లుగా నా ఫ్రెండ్‌ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఆ తర్వాత విజయాలు వరించాయి. జీవితంలో ఏదో ఒకటి సాధించగలననే నమ్మకం వచ్చింది. ఒకవేళ నాకు మరో అవకాశం దక్కి ఉండకపోతే రోడ్ల మీద పానీపూరీ అమ్ముకునేవాడిని’’ అని షెల్డన్‌ చెప్పుకొచ్చాడు.

అంతా గౌతం భయ్యా వల్లే!
కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘ఢిల్లీతో రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో నేను హాఫ్‌ సెంచరీతో మెరిశాను. గౌతం భాయ్‌ దగ్గరకు వెళ్లి నేను బాగా ఆడానా భయ్యా? నా గేమ్‌ మీకు నచ్చిందా? అని అడిగాను. అవును.. బాగా బ్యాటింగ్‌ చేశావు. నిన్ను కేకేఆర్‌ సొంతం చేసుకుంటుంది రెడీగా ఉండు అని అన్నారు. అయితే, ఐపీఎల్‌ వేలంలో తొలి రౌండ్‌లో నన్ను ఎవరూ కొనలేదు. నిస్సత్తువ ఆవహించింది.

అప్పుడే కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి కాల్‌ వచ్చింది. గౌతం భాయ్‌ నా గురించి చెప్పారట. అందుకే నన్ను కొంటున్నారని చెప్పారు. ఆర్థికంగా, మానసికంగా నాకు ఊరట కలిగించిన రోజు అది. మా అమ్మ ముఖంలో సంతోషం చూశాను. నాకు అండగా నిలబడ్డ గౌతం భయ్యా.. అప్పుడూ.. ఇప్పుడూ నాకు ఆరాధనా భావమే ఉంటుంది’’ అని 34 ఏళ్ల షెల్డన్‌ జాక్సన్‌ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.  కాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 5 వేల పరుగులు చేసిన షెల్డన్‌.. ఇటీవలి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 50 బంతుల్లో 106 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్‌లో భాగంగా 2017లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో క్యాష్‌ రిచ్‌లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.

చదవండి: IPL 2021 Phase 2: అతనొక్కడే.. ఆర్సీబీ ఇంతవరకు టైటిల్‌ గెలవలేదు కాబట్టి..
IPL 2021 Phase 2: ఇయాన్‌ మోర్గాన్‌ నా గురించి ఏమనుకుంటున్నాడో..

>
మరిన్ని వార్తలు