స్టార్‌ హోటళ్లు వద్దు!

6 Aug, 2020 01:10 IST|Sakshi
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు

వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ఆలోచన

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ షెడ్యూలుపై స్పష్టత వచ్చేసింది కానీ... దానితో ముడిపడిన ఎన్నో అంశాలపై ఇంకా గందరగోళం ఉంది. ఇందులో నిర్వహణ సమస్యలు కొన్ని కాగా... మరికొన్ని ఆటగాళ్ల డిమాండ్లు, భయాల గురించి ఉన్నాయి. లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నా... క్రికెటర్లలో కరోనా భయం ఏ మూలో వెంటాడుతూనే ఉంది. అందుకే ప్రతీ విషయంలో వారు జాగ్రత్తలు కోరుకుంటున్నారు.

వాటిని తమ ఫ్రాంచైజీల ముందు ఉంచుతున్నారు. ఇందులో ఇప్పుడు క్రికెటర్ల వసతి అంశం తెరపైకి వచ్చింది. ఎప్పట్లా సకల సౌకర్యాలు ఉండే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను ఆటగాళ్లను కోరుకోవడం లేదు. అక్కడ బస చేయడంపై కొన్ని భయాలు ఉన్నాయి. సాధారణంగా హోటల్‌ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్‌ కండిషనింగ్‌ డక్ట్‌ల ద్వారా కోవిడ్‌ వైరస్‌ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో ఉంది.

పైగా పెద్ద సంఖ్యలో ఇతర పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నా యాలపై దృష్టి పెట్టాయి. దుబాయ్‌లో గోల్ఫ్‌ రిసార్ట్‌లలో ఆటగాళ్లను ఉంచే విషయంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా ఇదే బాటలో ఉన్నాయి. ముంబై యాజమాన్యమైతే  ఒక అపార్ట్‌మెంట్‌ మొత్తాన్ని ఆటగాళ్ల కోసమే అద్దెకు తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. ‘హోటల్‌లో అందరినీ ప్రతీ సారి స్క్రీనింగ్‌ చేయడం సాధ్యమయ్యే పని కాదు. దుబాయ్‌లోని రిసార్ట్‌లలో సకల సౌకర్యాలు ఉంటాయి.

ఇక్కడ ఒక్కో ఆటగాడికి ఒక్కో గదిని కేటాయించడం కష్టం కాకపోవచ్చు’ అని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. కొందరు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ సమయంలో మానసిక ఉల్లాసానికి తమకు గోల్ఫ్‌ ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రిసార్ట్‌లలో ఉంటే ఇది సాధ్యమవుతుందని, పైగా గోల్ఫ్‌ సోషల్‌ డిస్టెన్సింగ్‌లోనే జరుగుతుందని, ఏ సమస్యా ఉండ దని చెబుతున్నారు.

కాంటాక్ట్‌లెస్‌ ఫుడ్‌ కావాలి...
మరో వైపు ఐపీఎల్‌కు సంబంధించి పలు అంశాలపై ఫ్రాంచైజీల సందేహాలు ఇంకా తీరలేదు. వీటిపై తమకు మరింత స్పష్టతనివ్వాలని వారు కోరుతున్నారు. లీగ్‌లో గాయపడితే అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం అలానే ఉంది. అయితే బయటినుంచి కాకుండా  కొందరు ఆటగాళ్ల బృందంతో బీసీసీఐ ఒక జాబితాను సిద్ధం చేసి వారిలోంచే ఎవరినైనా తీసుకునేలా ఫ్రాంచైజీల ముందు పెట్టే అవకాశం కనిపిస్తోంది. యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌ కాకుండా వైద్యుల సూచనలు తీసుకుంటూ  కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి.

ఆటగాళ్లు తీసుకునే ఆహారం పలువురు చేతులు మారకుండా  ‘కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ’ ఉండాలని డిమాం డ్‌ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను అనుమతించాలని విజ్ఞప్తులు  బోర్డుకు ఎక్కువయ్యాయి. సుమారు 80 రోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని వారు చెబుతున్నారు. అన్నింటికీ మించి తమ స్పాన్సర్ల ప్రచార కార్యక్రమాలను ఎలా నిర్వహించుకోవచ్చనే విషయంపై కూడా మరింత స్పష్టత కావాలని ఫ్రాంచైజీలు అడుగుతున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు