IPL 2022: వరుసగా నాలుగో వారం పడిపోయిన ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్

20 Apr, 2022 18:12 IST|Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీసీసీఐను రెండు పాన్‌ ఇండియా సినిమాలు భారీగా దెబ్బకొట్టాయి. రాజమౌళి ట్రిపుల్‌ ఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ పార్ట్‌-2 సినిమాల ప్రభావం ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌పై పడింది. ఈ రెండు భారీ బడ్జెట్‌ సినిమాల కారణంగా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌కి అనుకున్నంత వ్యూయర్‌షిప్ రావడం లేదన్నది బహిరంగ రహస్యం. 2020 సీజన్‌తో పోలిస్తే రెండు విడతలుగా నడిచిన 2021 సీజన్‌కి డబుల్ టీఆర్పీ రాగా, ప్రస్తుత సీజన్‌లో ఆ రేటింగ్‌ సగానికి సగం పడిపోయింది. 

ఐపీఎల్‌ 2022 ప్రారంభమైన (మార్చి 26) తొలి మూడు వరాలు ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కారణంగా 30 శాతం టీఆర్పీ పడిపోగా... నాలుగో వారం ‘కేజీఎఫ్ 2’ ఎంట్రీతో రేటింగ్‌ ఊహించని స్థాయికి దిగజారింది. వ్యూయర్షిప్‌ పడిపోవడానికి ఈ రెండు సినిమాలు ఓ కారణమైతే.. ఐపీఎల్‌కు కళ తెచ్చిన రెండు అగ్రశ్రేణి జట్లు (ముంబై, సీఎస్‌కే) ఈ సీజన్‌లో దారుణంగా విఫలం కావడం మరో కారణం. 2021 సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సగటున 2 నుంచి 5 మిలియన్ల వరకు వీక్షించగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. గరిష్టంగా 50 నుంచి 60 లక్షల మంది మాత్రమే ప్రస్తుత సీజన్‌ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షిస్తున్నారు. 
చదవండి: ఢిల్లీ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా..పంజాబ్‌తో నేటి మ్యాచ్‌ సాధ్యపడేనా..?

మరిన్ని వార్తలు