Venkatesh Iyer: ఐపీఎల్‌ వేలంలో రెండు రౌండ్లపాటు నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. ఆ తర్వాత..

15 Jan, 2022 16:58 IST|Sakshi

Venkatesh Iyer Comments: ‘‘గతేడాది ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రాణించాను. ఏ జట్టుకు ఆడినా గెలుపునకై నా వంతు కృషి​ చేస్తాను. ఈ క్రమంలోనే కేకేఆర్‌ నన్ను వేలంలో కొనుగోలు చేసింది. నిజానికి రెండు రౌండ్ల పాటు నేను అన్‌సోల్డ్‌(కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు)గా మిగిలిపోయాను. చివరి రౌండ్‌లో కేకేఆర్‌ నన్ను కొనుగోలు చేసింది. వారికి నా ధన్యవాదాలు. ఒకవేళ కేకేఆర్‌ నన్ను ఎంచుకుని ఉండకపోతే.. నేను ఇక్కడ ఉండేవాడినే కాదు’’ అని టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ గతాన్ని నెమరువేసుకున్నాడు.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ మినీ వేలం-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వెంకటేశ్‌ను కొన్న సంగతి తెలిసిందే.  20 లక్షల రూపాయలు వెచ్చింది అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్‌ అత్యద్భుతంగా రాణించాడు. 10 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ ఓపెనర్‌ 370 పరుగులు సాధించాడు. అంతేకాదు కేకేఆర్‌ అనూహ్యంగా పుంజుకుని ఫైనల్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. 

ఈ నేపథ్యంలో దేశవాళీ టీ20 టోర్నీ, ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీమిండియా పర్యటన నేపథ్యంలో తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇలా అతడి దశ తిరిగిపోయింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ తన కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

‘‘ఒక్కసారి కేకేఆర్‌ క్యాంపులో అడుగుపెట్టిన తర్వాత.. నాకంటూ ఓ గుర్తింపు వచ్చిందనుకున్నా. నా జీవితానికి సంబంధించి ఇదో కీలక మలుపు. మొదటి దశలో అవకాశం రాలేదు. అయినా కేకేఆర్‌ యాజమాన్యం నాపై నమ్మకం ఉంచింది. యూఏఈలో ఆడే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20- 30 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్టోరీ ఇది. నిజంగా నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకమైనది’’ అని కేకేఆర్‌ ఫ్రాంఛైజీ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో భాగంగా కోల్‌కతా అయ్యర్‌ను రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. 

చదవండి: WTC Points Table: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్‌..
Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..!

మరిన్ని వార్తలు