Robin Uthappa: ఐపీఎల్‌తో పోలికా.. పాక్ జర్నలిస్ట్‌కి కౌంటరిచ్చిన రాబిన్ ఊతప్ప

19 Mar, 2022 22:23 IST|Sakshi

ఐపీఎల్‌ను తక్కువ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ పాక్ జర్నలిస్ట్‌కు టీమిండియా ప్లేయర్‌, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు రాబిన్ ఊతప్ప చురకలంటించాడు. ఇటీవల ఫిరోజ్ అనే సదరు పాక్ జర్నలిస్ట్‌.. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్)‌ను ఆకాశానికెత్తుతూ, ఐపీఎల్‌ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. పీఎస్‌ఎల్‌తో ఐపీఎల్‌ను పోల్చకండి.. పీఎస్ఎల్ 2016లో ఆరంభమైతే, ఐపీఎల్ 2008లోనే మొదలైంది.. పీఎస్‌ఎల్, ఐపీఎల్‌ కంటే వేగంగా పాపులారిటీ దక్కించుకుంది.. ఐపీఎల్ పుట్టినప్పుడు మార్కెట్‌లో పోటీగా మరో లీగ్ లేదు.. అంటూ ఫిరోజ్‌ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ఊతప్ప స్పందిస్తూ.. నువ్వు అంటున్న ఆ మార్కెట్‌ని క్రియేట్ చేసిందే ఐపీఎల్.. అంటూ గట్టిగా కౌంటరిచ్చాడు.
 


ఇదిలా ఉంటే, ఇటీవల పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రాజా ఐపీఎల్‌పై తన అక్కసును వెల్లగక్కడంతో ఐపీఎల్ వర్సస్ పీఎస్‌ఎల్ చర్చ మొదలైంది. ఐపీఎల్‌ తరహాలో పీఎస్‌ఎల్‌లోనూ వేలం పద్ధతి ప్రవేశపెడితే, ఇండియన్ లీగ్ ఆడేందుకు ఏ విదేశీ క్రికెటర్ ముందుకు రాడంటూ రమీజ్ సంచలన కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు. ఓ ఆటగాడిపై 16 కోట్లు ఖర్చు చేసే స్తోమత పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీలకు ఉందా అంటూ ప్రశ్నించాడు. కాగా, పీఎస్‌ఎల్‌లో ఆ దేశ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్‌కు ఇచ్చే రూ.3 కోట్లే అత్యధికం. 
చదవండి: IPL 2022: సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన నేచురల్ స్టార్ నాని

మరిన్ని వార్తలు