WPL 2023: రెండు ముంబై ఇండియన్స్‌ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు

7 Mar, 2023 13:29 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లలో ముంబై బేస్డ్‌, రిలయన్స్‌ ఓన్డ్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ మెన్స్‌ టీమ్‌, డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌ టీమ్‌ రెండూ  ప్రపంచంలోనే మేటి జట్లు అన్న విషయంతో అందరూ ఏకీభవించాల్సిందే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఈ విషయాన్ని ఇదివరకే ప్రూవ్‌ చేసుకోగా.. డబ్ల్యూపీఎల్‌ ప్రారంభమైన కొద్ది రోజులకే ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌ టీమ్‌ ఈ విషయాన్ని రుజువు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసి టైటిల్‌ రేసులో ముందువరుసలో నిలిచింది. 

ఎంఐ మెన్స్‌ టీమ్‌ విషయానికొస్తే.. 15 ఐపీఎల్‌ ఎడిషన్లలో 5 సార్లు ఛాంపియన్‌గా, ఐదు ఛాంపియన్స్‌ లీగ్‌ ఎడిషన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు.. కొత్తగా ప్రూవ్‌ చేసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ, కొన్ని గడ్డు పరిస్థితుల దృష్ట్యా గత రెండు సీజన్లుగా దారుణంగా విఫలమవుతూ వస్తుంది. స్టార్‌ ఆటగాళ్లు అందుబాటు లేకపోవడం, జూనియర్లు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుండటం వల్ల ఎంఐ టీమ్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది.

పరిస్థితులు ఎలా ఉన్నా , వెంటనే సర్దుకుని తిరిగి గెలుపు ట్రాక్‌పై ఎక్కడం ఆ జట్టుకు ఇది కొత్తేమీ కాదు. కాబట్టి గత సీజన్ల గెలుపోటములతో పని లేకుండా, రాబోయే సీజన్‌లో ఎంఐ మెన్స్‌ టీమ్‌ సత్తా చాటి మరో టైటిల్‌ సాధిస్తుందని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. రాబోయే సీజన్‌లో బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయం​ తప్పిస్తే.. ఆ జట్టు అన్ని  విభాగాల్లో పర్ఫెక్ట్‌గా ఉంది. 

బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, డెవాల్డ్‌ బ్రెవిస్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌.. ఆల్‌రౌండర్ల కోటాలో టిమ్‌ డేవిడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, అర్జున్‌ టెండూల్కర్‌, బౌలింగ్‌ విభాగంలో జోఫ్రా ఆర్చర్‌, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, డుయాన్‌ జన్సెస్‌, పియుష్‌ చావ్లా లాంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్‌ మెన్స్‌ టీమ్‌ పటిష్టంగా ఉంది. గాయపడిన బుమ్రా, జై రిచర్డ్‌సన్‌ స్థానాల్లో ఇ‍ద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు దొరికితే ఈ విభాగంలోనూ ఆ జట్టు పటిష్టంగా మారుతుంది. 

ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. తొట్టతొలి ఐపీఎల్‌ను ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలతో ప్రారంభించగా.. అందుకు భిన్నంగా డబ్ల్యూపీఎల్‌లో ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఎందుకంటే 4 వరుస పరాజయాలతో అరంగేట్రం ఐపీఎల్‌ సీజన్‌ను ప్రారంభించిన ఎంఐ మెన్స్‌ టీమ్‌.. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా.. 2011, 2013 ఛాంపియన్స్‌ లీగ్‌ విజేతగా నిలిచింది. ఎంఐ మెన్స్‌ టీమ్‌కు భిన్నంగా వుమెన్స్‌ టీమ్‌ ప్రస్తానం సాగుతుండటంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఎంఐ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ స్టార్లతో నిండి ఉంది కాబట్టి, ఆ జట్టే తొలి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ ఎగురేసుకుపోతుందని కొందరు ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు