Ire Vs Afg 3rd T20: ఐర్లాండ్‌ చేతిలో వరుసగా రెండు ఓటముల తర్వాత ఎట్టకేలకు..

13 Aug, 2022 11:00 IST|Sakshi
ఐర్లాండ్‌తో మూడో టీ20లో అఫ్గనిస్తాన్‌ విజయం(PC: Afghanistan Cricket)

ఐర్లాండ్‌తో మూడో టీ20లో అఫ్గనిస్తాన్‌ విజయం

Ireland vs Afghanistan, 3rd T20I : ఐర్లాండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన అఫ్గనిస్తాన్‌కు ఎట్టకేలకు విజయం దక్కింది. బెల్‌ఫాస్ట్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో మహ్మద్‌ నబీ బృందం 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్‌ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. అర్ధ శతకంతో రాణించిన అఫ్గన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌(35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం అఫ్గనిస్తాన్‌.. ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి రెండు మ్యాచ్‌లలో ఐర్లాండ్‌ వరుసగా 7 వికెట్లు, ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది పర్యాటక జట్టుకు గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో మూడో టీ20లో విజయం సాధించిన అఫ్గనిస్తాన్‌ సిరీస్‌ గెలుపు రేసులో నిలిచింది.

మ్యాచ్‌ సాగిందిలా!
బెల్‌ఫాస్ట్‌లోని సివిల్‌ సర్వీస్‌ క్రికెట్‌ క్లబ్‌ వేదికగా ఐర్లాండ్‌- అఫ్గనిస్తాన్‌ శుక్రవారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

అందరూ అదరగొట్టారు.. కెప్టెన్‌ మాత్రం
ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ 39, గుర్బాజ్‌ 53 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇబ్రహీం 36, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన నజీబుల్లా 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ మహ్మద్‌ నబీ(6) మాత్రం మరోసారి నిరాశపరిచాడు.

ఆదిలోనే ఎదురుదెబ్బ!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ ఒకే ఒక్క పరుగు తీసి పెవిలియన్‌ చేరాడు. ఓపెనింగ్‌ జోడీ విఫలం కావడం సహా మిడిలార్డర్‌ కుప్పకూలడంతో ఐర్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి.

అయితే, జార్జ్‌ డాక్‌రెల్‌ 58 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేసినా వృథానే అయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది.

చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే!
NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్‌ దిశగా వెస్టిండీస్‌

మరిన్ని వార్తలు