IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్‌ కైవసం

18 Aug, 2022 09:44 IST|Sakshi

Ireland vs Afghanistan, 5th T20I: సీమర్లు మార్క్‌ అడైర్‌ (3/16), జాషువ లిటిల్‌ (2/14) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో ఐర్లాండ్‌ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని పర్యాటక జట్టుకు భారీ షాకిచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్‌ స్కోర్‌ 15 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా భారీ వర్షం కురువడంతో ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపేసిన అంపైర్లు.. ఆ తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌కు 7 ఓవర్లలో 56 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఐర్లాండ్‌ 3 వికెట్లు కోల్పోయి మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 

ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఘని (40 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఐర్లాండ్‌ బ్యాటర్లు కూడా తడబడినప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించారు.

పాల్‌ స్టిర్లింగ్‌ (10 బంతులో​ 16), లోర్కన్‌ టక్కర్‌ (12 బంతుల్లో 14) రెండంకెల స్కోర్లు సాధించగా.. హ్యారీ టెక్టార్‌ (5 బంతుల్లో 9), జార్జ్‌ డాక్రెల్‌ (4 బంతుల్లో 7) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌ గెలుపొందగా.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డిసైడర్‌ దాకా తీసుకువచ్చింది. 

చదవండి: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్

మరిన్ని వార్తలు