Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్‌ను వణికించారు! వరుస సెంచరీలతో..

16 Jul, 2022 10:34 IST|Sakshi

Ireland Vs New Zealand ODI Series 2022: ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియాకే చెమటలు పట్టించింది ఐర్లాండ్‌. ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి నాలుగు పరుగుల తేడాతో హార్దిక్‌ పాండ్యా సేన చేతిలో ఓడింది. అయినా.. ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకుంది. అదే తరహాలో​ శుక్రవారం నాటి మూడో వన్డేలోనూ చివరి వరకు ఐర్లాండ్‌ జట్టు పోరాడిన తీరు అద్భుతం.

అట్లుంటది మాతోని
ఇప్పటికే కివీస్‌కు సిరీస్‌ సమర్పించుకున్న ఐర్లాండ్‌.. డబ్లిన్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 361 పరుగుల భారీ స్కోరు ఛేదించే దిశగా పయనించి న్యూజిలాండ్‌ ఆటగాళ్లను వణికించింది. 

ఐర్లాండ్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ 120 పరుగులతో అదరగొడితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ టెక్టార్‌ 108 పరుగులు సాధించాడు.కానీ ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. బై రూపంలో ఒక పరుగు మాత్రమే లభించడంతో ఆండ్రూ బృందం పర్యాటక కివీస్‌ ముందు తలవంచక తప్పలేదు. 

పసికూన కాదు!
ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌ ఓడినా అసాధారణ ఆట తీరుతో మనసులు మాత్రం గెలుచుకుందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా, కివీస్‌ వంటి మేటి జట్లకే వణుకు పుట్టించింది ఇకపై ఐర్లాండ్‌ పసికూన కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ సైతం ఐర్లాండ్‌ పోరాట పటిమను కొనియాడాడు.

మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్‌ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌ రూపొందించినందుకు గ్రౌండ్స్‌మెన్‌కు క్రెడిట్‌ ఇవ్వాలి. మేము బ్యాటింగ్‌ చేసే సమయంలో హార్డ్‌గా ఉంది.

ఐర్లాండ్‌ బ్యాటర్లు సైతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అయితే, వారు ఆడిన విధానం అమోఘం. మేము ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు పోరాడిన తీరు అద్భుతం. ఐర్లాండ్‌ జట్టు రోజురోజుకీ తమ ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆకట్టుకుంటోంది’’ అని కొనియాడాడు.

ఇక ఐర్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ.. ‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్‌. మేము చాలా బాగా ఆడాము. కానీ ఓటమి పాలయ్యాం. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఐరిష్‌ జెర్సీలోని ఆటగాళ్లు రెండు సెంచరీలు నమోదు చేయడం సూపర్‌.

టెక్టర్‌ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో రెండు శతకాలు బాదాడు. ఈ ఏడాది మాకు ఇదే ఆఖరి వన్డే అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అయితే, మరిన్ని టీ20 మ్యాచ్‌లు ఆడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్‌ వరుసగా ఒక వికెట్‌, మూడు వికెట్లు, ఒక పరుగు తేడాతో ఓడిపోయింది.

ఐర్లాండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మూడో వన్డే
వేదిక: ది విలేజ్‌, డబ్లిన్‌
టాస్‌: న్యూజిలాండ్‌- బ్యాటింగ్‌
న్యూజిలాండ్‌ స్కోరు: 360/6 (50)
ఐర్లాండ్‌ స్కోరు: 359/9 (50)
విజేత: ఒక పరుగు తేడాతో న్యూజిలాండ్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మార్టిన్‌ గప్టిల్‌(126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు)

మరిన్ని వార్తలు