Kevin Obrien: ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి! కెవిన్‌ అరుదైన ఘనతలు!

16 Aug, 2022 16:37 IST|Sakshi

ఐర్లాండ్‌ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఒబ్రెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు మంగళవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐర్లాండ్‌ చారిత్రాత్మక విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించిన అతడిని గత ఏడాది కాలంగా సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేయలేదు. 

దీంతో టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో ఆడాలని ఉన్నప్పటికీ.. సెలక్టర్ల ఆలోచన వేరే విధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తన రిటైర్మెంట్‌ ప్రకటనలో వెల్లడించాడు కెవిన్‌.

కాగా 2006 నుంచి 2021 వరకు 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో కెవిన్‌ ఒబ్రెయిన్‌ ఎన్నో సంచలన విజయాలు నమోదు చేశాడు. పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అవేమిటో పరిశీలిద్దాం.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐరిష్‌ క్రికెటర్‌ కెవిన్‌ ఒబ్రెయిన్‌ సాధించిన విజయాలు:
ఐసీసీ పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ
భారత్‌ వేదికగా సాగిన వన్డే వరల్డ్‌కప్‌-2011 సందర్భంగా కెవిన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 113(63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో) పరుగులు సాధించాడు. 

కొండంత లక్ష్యం ముందున్న సమయంలో టాపార్డర్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైన వేళ నేనున్నాంటూ కెవిన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి అద్భుత సెంచరీతో మెరిశాడు. దీంతో మేటి జట్టు అయిన ఇంగ్లండ్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 

మొదటి, ఏకైక బ్యాటర్‌!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో శతకం నమోదు చేసిన మొదటి, ఏకైక ఐర్లాండ్‌ ఆటగాడిగా కెవిన్‌ ఒబ్రెయిన్‌ ఘనత సాధించాడు. డబ్లిన్‌ వేదికగా 2018లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు 118 పరుగులు చేశాడు. 

అరుదైన రికార్డు
మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన ఏకైక ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్‌ ఒబ్రెయిన్‌. పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి, టెస్టుల్లో ఒక శతకం సాధించాడు. 

2013లో అవార్డు
ఐర్లాండ్‌ జట్టులో కీలక ఆటగాడైన కెవిన్‌ ఒబ్రెయిన్‌ తన అద్భుత ఆట తీరుతో.. 2013లో ఐసీసీ మెన్స్‌ అసోసియేట్‌​ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాడు.

మూడో ఆటగాడిగా..
2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. తన కెరీర్‌లో మొత్తంగా 152 వన్డేల్లో భాగమైన కెవిన్‌ 141 ఇన్నింగ్స్‌లో 3619 పరుగులు చేశాడు. తద్వారా ఐర్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో కెవిన్‌ అత్యధిక స్కోరు 142. సెంచరీలు రెండు.

టీ20లలోనూ...
2008లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో పొట్టి ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు కెవిన్‌ ఒబ్రెయిన్‌. మొత్తంగా 103 ఇన్నింగ్స్‌ ఆడి 1973 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐర్లాండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు. పొట్టి క్రికెట్‌లో కెవిన్‌ అత్యధిక స్కోరు 124.

బౌలర్‌గానూ..
కుడిచేతి వాటం గల బ్యాటర్‌ అయిన కెవిన్‌ ఒబ్రెయిన్‌ రైట్‌ ఆర్మ్‌ మీడియం ఫాస్ట్‌బౌలర్‌ కూడా. వన్డే క్రికెట్‌లో అతడు 116 ఇన్నింగ్స్‌లో 114 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/13. తద్వారా ఐర్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత. 

ఇక టీ20 ఫార్మాట్‌లో 52 ఇన్నింగ్స్‌లో కెవిన్‌ 58 వికెట్లు కూల్చి.. ఈ ఘనత సాధించిన మూడో ఐర్లాండ్‌ బౌలర్‌గా నిలిచాడు. 

వీటితో పాటు కెవిన్‌ ఒబ్రెయిన్‌ పేరిట ఉన్న మరిన్ని రికార్డులు
►వన్డే ఫార్మాట్‌లో మొదటి బంతికే వికెట్‌ తీసిన 16వ ఆటగాడు కెవిన్‌ ఒబ్రెయిన్‌(ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఆండ్రూ స్ట్రాస్‌ వికెట్‌)
►ప్రపంచకప్‌ టోర్నీలో అలెక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు(ఇంగ్లండ్‌ జట్టు మీద)

►ఐర్లాండ్‌ వన్డే జట్టు నాలుగో కెప్టెన్‌గా కెవిన్‌ ఒబ్రెయిన్‌
►ఐర్లాండ్‌ టీ20 జట్టు రెండో సారథిగా కెవిన్‌ ఒబ్రెయిన్‌
-వెబ్‌డెస్క్‌
చదవండి: ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్‌ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే..

మరిన్ని వార్తలు